పెరుగుతున్న చమురు ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుంటే అవి మాత్రం ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. చౌక ధరలతో ప్రయాణించవచ్చనే కోరికను నిలువెత్తునా పాతిపెడుతున్నాయి. చాలా చోట్ల వాహన చోదకుల ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో ఓ వ్యక్తి చేసిన పని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తిరుపత్తూరుకు చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాడు. తాను నివసించే ఏరియా ఆ ఆర్డీవో పరిధిలోకి రాదని తెలియడంతో తమ ఏరియా ఆర్డీవో ఆఫీసుకు బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో స్కూటీ ఉన్నట్టుండి ఆగిపోయింది.
ఎంత ప్రయత్నించినా తిరిగి స్టార్టవలేదు. ఈ విషయాన్ని కంపెనీ కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. స్పందన రాలేదు. వీడియో కాల్ చేసి పంపాడు. మూడు గంటలైనా కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోపగించి, స్కూటీని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వీడియో వైరల్ అయింది.