ఏపీ : అకౌంటులో పడ్డ కోటి రూపాయలను తిరిగిచ్చేసిన వ్యాపారి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ : అకౌంటులో పడ్డ కోటి రూపాయలను తిరిగిచ్చేసిన వ్యాపారి

May 31, 2022

ఉత్త పుణ్యానికి బ్యాంకు అకౌంటులో పడ్డ సొమ్మును స్వంత అవసరాలకు వాడుకోకుండా బ్యాంకు వారికి తిరిగిచ్చేసిన వ్యాపారి కథనం ఇది. పొరపాటు జరిగిందని బ్యాంకు వారు కూడా గుర్తించకముందే నిజాయితీతో తానే వెళ్లి ఆ డబ్బును తిరిగిచ్చేశాడు. ఏదో వందలు, వేలు కాదు. ఏకంగా ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలను తిరిగిచ్చేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన గౌరీ శంకర్‌కు మెయిన్ బజారులో ఫ్యాన్సీ షాపు ఉంది. షాపు తరపున స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అకౌంటు తెరిచాడు. వ్యాపార లావాదేవీలను ఆ అకౌంటు ద్వారానే నిర్వహించేవాడు. ఈ క్రమంలో గత ఆదివారం గైరీ శంకర్ ఇంట్లో సరదాగా గడుపుతుండగా, అతని ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది. మొత్తం ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలు అకౌంటులో జమ అయ్యాయని ఆ మెసేజ్ సారాంశం. దాంతో ఒక్క సారిగా షాకయిన గౌరీ శంకర్ మొదట ఆ మెసేజ్ ఫేక్ అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని అకౌంటులో చూసుకోగా, మెసేజ్ ప్రకారం మొత్తం డబ్బు జమ అయి ఉంది. అప్పటికీ నమ్మకం కుదరక తెలిసిన వ్యక్తికి ఓ లక్ష రూపాయలను పంపాడు. ఆ మొత్తం ట్రాన్స్‌ఫర్ కావడంతో నిజంగా అకౌంటులో డబ్బులు పడ్డాయని నిర్ధారించుకున్నాడు. ఆ వెంటనే పరాయి సొమ్ము మనకు వద్దు అనుకొని మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి అక్కడి సిబ్బందికి జరిగిన విషయం తెలియజేశాడు. అయితే ఈ విషయం అప్పటివరకు బ్యాంకు వారికి కూడా తెలియదంట. దాంతో విచారించిన బ్యాంకువారు సాంకేతిక లోపం కారణంగా డబ్బు జమ అయినట్టు గుర్తించారు. అనంతరం గౌరీ శంకర్ అకౌంటు నుంచి బ్యాంకు సిబ్బంది ఆ డబ్బును తిరిగి బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. కాగా, అంత పెద్ద మొత్తం వచ్చినా కూడా ఆశపడకుండా తిరిగిచ్చేసిన గౌరీ శంకర్ నిజాయితీని అక్కడున్న వారందరూ మెచ్చుకున్నారు.