రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో.. మూడపల్లీ గ్రామ యువతి కిడ్నాప్ పై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతలపై ఆరా తీశారు. మూడపల్లి యువతి కిడ్నాప్ నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టం అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దన్నారు.
మరోవైపు ఈ కేసులో కిడ్నాప్ చేసిన యువతి శాలినికి.. కిడ్నాపర్ జాన్‌తో ఇదివరకే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. అయితే.. శాలిని మైనర్ కావడం, ఈ పెళ్లి కూడా ఇష్టం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులకు కేసు పెట్టారు. ఈ కేసులో జాన్ పది నెలల జైలు శిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జాన్ మళ్లీ శాలినికి దగ్గర అవుతుండడంతో.. తల్లిదండ్రులకు ఆమెకు మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్.. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపాడు. తెల్లవారుజామున ఆలయంలో పూజ ముగించుకొని శాలిని బయటకు రాగానే.. ఆమె తండ్రి ముందే తన స్నేహితుల సహకారంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శాలిని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.