‘కోడిపందేల చట్టం ఈ వైసీపీ ఎంపీకి వర్తించదా?’ - MicTv.in - Telugu News
mictv telugu

‘కోడిపందేల చట్టం ఈ వైసీపీ ఎంపీకి వర్తించదా?’

January 14, 2020

 

 

YSRCP MP

ఏటా సంక్రాంతి సమయంలో ప్రజలు కోడి పందాలకు సై అంటే సై అంటున్నారు. అవి చట్ట విరుద్ధమని  పోలీసుల ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పందెం రాయుళ్లు చాటుమాటుగా పందాలు కాస్తున్నారు. కొన్నిచోట్ల వేసిన టెంట్లను పోలీసులు తొలగిస్తున్నారు. కేసులు కూడా పెడుతున్నాయి. అయితే  ఓ ఎంపీ కూడా కోడి పందాలను దగ్గరుండి మరీ నిర్వహించడం సంచలనంగా మారింది. 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, దగ్గరుండి మరీ కోడి పందాలను ప్రారంభించారు. ‘తెలుగు ప్రజల విశిష్ఠ పండగ సంక్రాంతి సంప్రదాయంలో కోడి పందాలు ఓ భాగం. సంప్రాదాయాలను కాపాడుకోవడంలో తప్పేంలేదు. గోదావరి జిల్లాల్లో ఈ పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో కోళ్ల జాతులను పరిరక్షించేందుకు ఇదో మంచి అవకాశం. కోడి పందాలతో పాటు, ఎడ్ల పందాలు, పొటేలు పందాలలాంటివి కూడా కాపాడుకోవాలి. కోడి పందాలను జగన్ ఆపరు. గోదావరి జిల్లాలో కోడి పందాలను ఎవరూ ఆపలేరు’ అని ఆయన అన్నారు. అయితే కత్తులకు మాత్రం తాను వ్యతిరేకమని అన్నారు. తన ఇంటి వద్ద డింకీ పందాలు నిర్వహించానని తెలిపారు. 


ఇదిలావుండగా పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా ఏపీలో అనేక చోట్ల కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. భీమవరం, పెద్దాపురం, నరసాపురం, ఉండి, అమలాపురం, కాకినాడ, గుడివాడ, ఏలూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున పందెం రాయుళ్లు బరులు సిద్ధం చేశారు. ఈ ఉదయం నుంచి పందాలను సిద్ధం చేశారు. పోలీసుల ఆంక్షలను ఖాతరు చేయకుండా కోళ్లకు కత్తులు కట్టి, లక్షల్లో పందాలు వేస్తున్నట్టు సమాచారం. కోడి పందాలతో పాటు గుండాట, పేకాట కూడా జోరుగానే సాగుతున్నాయి. మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నట్టు తెలుస్తోంది.  పోలీసులు పలు చోట్ల అరెస్టులు చేస్తున్నారు. అయితే తమను మాత్రమే అరెస్ట్ చేసి, రఘురామకృష్ణం రాజును ఎలా వదిలేస్తారని పందెరాయుళ్లు ప్రశ్నిస్తున్నారు.