మూడున్నరేళ్ల వయసులో ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలికను ఈటీవీ నిర్వహించిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రాం తన కుటుంబానికి దగ్గర చేసింది. వివరాలు.. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో నివసించే కృష్ణ, అనూరాధ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం. 2014 వినాయకచవితి వేడుకలు జరుగుతుండగా, ఇందు అనే చిన్నారి తప్పిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసి వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఇక దొరకడం కష్టమనుకొని వెతకడం ఆపేశారు. ఈ నేపథ్యంలో జూన్ 19న ఫాదర్స్ డే సందర్భంగా ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో అనాథ పిల్లలతో ఓ షో నిర్వహించారు. దానిని టీవీలో చూసిన అనురాధ.. అందులో తన తప్పిపోయిన కూతురు ఇందులాంటి పోలికలున్న అమ్మాయిని చూసి వివరాల కోసం ఆరా తీసింది. కిస్మత్ పురాలోని చెరిష్ అనాథాశ్రమం నుంచి వచ్చారని తెలుసుకొని అధికారుల సహాయంతో అక్కడికి వెళ్లింది. అక్కడికి వెళ్లి తన కూతురిని గుర్తుపట్టి అన్ని ఆధారాలను సమర్పించింది. వాటిని పరిశీలించిన సంబంధిత శాఖ అధికారులు.. ఇద్దరు ఒకటేనని నిర్ధారణకు వచ్చారు. జేజే యాక్ట్ 2015 కింద పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.