బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనే.. రాహుల్  - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీలో అత్యంత నిజాయితీపరుడు ఆయనే.. రాహుల్ 

October 21, 2019

‘ఏ బటన్ నొక్కినా ఓటు కమలానికే వెళ్తుంది’ అని హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బక్షిష్‌ సింగ్‌ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. బక్షిష్ సింగ్ మాట్లాడిన వీడియోను ట్వీట్‌ చేస్తూ.. ‘బీజేపీలో అత్యంత నిజాయతీపరుడు ఈయనే’ అని పేర్కొన్నారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో హరియాణా ఎన్నికల ప్రధాన అధికారి అనురాగ్‌ అగర్వాల్‌ స్పందించారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, బక్షిష్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.

హరియాణాలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బక్షిష్‌ సింగ్‌ ఇటీవల ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో బక్షిష్‌ ఓటర్లను హెచ్చరిస్తూ ఈవీఎంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఈవీఎంలలో ఎవరికి ఓటేస్తున్నారో మాకు తెలియదనుకోకండి. కావాలనుకుంటే మేం అది తెలుసుకోగలం. ఎందుకంటే మోదీజీ, మనోహర్‌లాల్‌జీ చాలా తెలివైనవారు. మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి. కానీ, మీ ఓటు మాత్రం కమలం గుర్తుకే వెళ్తుంది. ఈవీఎంలో ఏ బటన్‌ నొక్కినా అది బీజేపీకే ఓటు పడుతుంది’ అని బక్షిష్‌ ఆ వీడియోలో మాట్లడారు.