ఆపరేషన్ మగబిడ్డ.. 11 మంది ఆడపిల్లల తర్వాత సక్సెస్..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆపరేషన్ మగబిడ్డ.. 11 మంది ఆడపిల్లల తర్వాత సక్సెస్.. 

November 25, 2019

వరుసగా ఆమెకు ఆడపిల్లలే జన్మిస్తున్నారు. అత్తింటివారినుంచి, ఇరుగుపొరుగు వారినుంచి కూడా ఆమెకు అవమానాలు ఎదరురయ్యాయి. ‘ఆడపిల్లల మిషన్’ అంటూ ఆమెను తిట్టారు. దీంతో ఆమె ఎలాగైనా మగపిల్లాడిని కనాలని పంతం పట్టింది.  కానీ ఒకరివెనుక ఒకరు ఆడపిల్లలు పుట్టేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషనూ చేయించుకోలేదు. ఎట్టకేలకు ఆమె పంతం నెగ్గింది. 11 మంది ఆడపిల్లల తర్వాత ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 42 ఏళ్లు. రాజస్తాన్‌లోని చూరు జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ రోజుల్లో ఒక్క బిడ్డను కనేందుకే చాలా మంది ఇష్టపడట్లేదు. వారి పోషణ, చదువు సంధ్యలు తలకు మించిన భారంగా మారాయని భావిస్తున్నారు. అలాంటిది ఊళ్లో వాళ్ల మాటలు పడలేక ఆమె ఏకంగా 11 మంది పిల్లల్ని కని, 12వ సారి మగబిడ్డ పుట్టడంతో… దేవుడు దయ తలిచాడని ఆనందపడుతోంది.

ఆ మహిళ పేరు గుడ్డీ. కృష్ణ కుమార్‌తో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.  11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ నెల 20న మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పట్టిన ఆడపిల్లల్లో ముగ్గురికి పెళ్లిళ్లు అయిపోయాయి. మొదటపుట్టిన అమ్మాయి వయసు 22 ఏళ్లు.

కాగా, మధ్యప్రదేశ్‌లో 2017 ఫిబ్రవరిలో ఇలాంటి కేసే జరిగింది. అక్కడ ఓ మహిళ… 10 మంది ఆడపిల్లలు పుట్టాక 11వ సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మనదేశంలో ఆడపిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్నచూపులో మార్పు రావాలి. 

మగవాళ్లందరూ ఇది తెలుసుకోవాలి.. 

ఆడపిల్లలు పుట్టడం ఆడవాళ్ల తప్పు అయినుట్టు అజ్ఞానంగా మాట్లాడే మగవాళ్లు ఒక్కసారి సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అలాంటి మూర్ఖ మగాళ్లకు వంత పాడుతున్న ఆడవాళ్లు కూడా ఒక్కసారి పిల్లలు పుట్టడం వెనుక మగవారి పాత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సైన్స్ ప్రకారం.. ఆడవాళ్లలో రెండు ఎక్స్ క్రోమోజోములు, మగవాళ్లలో ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఒక వై క్రమోజోమ్ ఉంటాయి. పురుషులలో ఉత్పత్తి అయ్యే శుక్రకణాలు సగం ఎక్స్ క్రోమోజోములుగా, మిగతా సగం వై క్రోమోజోములు. స్త్రీలు మాత్రం ఒకే రకం ఎక్స్ క్రోమోజోములుగా, మిగతా సగం వై క్రోమోజోములను ఉత్పత్తి చేస్తారు. ఎప్పుడైతే అండకణాలు ఎక్స్ శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే ఆడపిల్లగా, అండకణాలు వై శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే మగబిడ్డగా మారుతారు. మొత్తానికి మగవారి శుక్రకణాలపై పుట్టబోయే బిడ్డ అమ్మాయా, అబ్బాయా అనేది ఆధారపడి ఉంటుంది.