మూలుగుబొక్క-4 వచ్చేసింది.. వదిన మరదలు ఒడిబియ్యం చూడండి..  - MicTv.in - Telugu News
mictv telugu

మూలుగుబొక్క-4 వచ్చేసింది.. వదిన మరదలు ఒడిబియ్యం చూడండి.. 

August 18, 2019

అందరూ ఎంతగానో ఆదిరిస్తున్న ‘మూలుగుబొక్క’ సిరీస్‌లో ఇప్పటికి మూడు భాగాలు వచ్చాయి. ప్రతి భాగాన్ని అంతే అభిమానంతో ఆదరించారు. తాజాగా నాలుగో సిరీస్ వచ్చేసింది. ‘వదిన మరదలు ఒడిబియ్యం’ పేరితో వచ్చిన ఈ ఎపిసోడ్‌లో తెలంగాణ ప్రాంతంలోని ఒడిబియ్యం ప్రాధాన్యతనే కథగా ఎంచుకోవడం జరిగింది. 

ఒడిబియ్యం అంటే.. పెళ్లి అనే బంధం కారణంగా ఆడబిడ్డ తల్లిదండ్రులకు, దూరంగా వెళ్లిపోవడమే కాక, కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం. బియ్యం, పెసరపప్పు, బెల్లం ముక్క, రవికబట్ట వేసి ఒడిబియ్యం కట్టి కూతురుని అత్తవారింటికి పంపిస్తారు. ఆ కల్చర్‌ను తెరపై చూపిస్తే ఎలా వుంటుందనే ఆలోచనలోంచే ఇది పుట్టింది. పుట్టింటికి వెళ్లిన భార్యకు భర్త ఫోన్ చేసి ఊరికి రమ్మంటాడు. పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు తమ్ముడు, మరదలు కలిసి ఒడిబియ్యం పోస్తారు. కొత్తబట్టలు కట్టిస్తారు.

ఈ క్రమంలో ఓ పోకిరీ ఆడపడుచును, ఒడిబియ్యాన్ని అవమానించినట్టు మాట్లాడతాడు. అప్పుడు మరదలు అతనికి బుద్ధి చెబుతుంది. బావమరిది, తమ్ముడు, అక్కాబావ, భార్యాభర్తలు, అత్త, అమ్మ, అమ్మలక్కలతో ఇల్లంతా సందడిగా పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ముత్తైదువలు అందరూ కలిసి ఒడిబియ్యం కలుపుతారు. భార్యాభర్తలు కలిసి ఆడపడుచుకి ఒడిబియ్యం పోస్తారు. ఒడిబియ్యం అనేది తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి ఆచారంలా కొనసాగుతోంది. అయితే ఇంతమంచి ఆచారాన్ని కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటివాళ్లకు ఈ వీడియో చెంపపెట్టులాంటిదని మూలుగుబొక్క అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కల్చర్‌ను మైక్ టీవీ జనాల్లోకి తీసుకెళ్తోందని అంటున్నారు. మంచి ప్రయత్నం అని అభినందిస్తున్నారు. ఆదరిస్తున్న అందరికీ మైక్ టీవీ కృతజ్ఞతలు చెబుతోంది. 

మైక్ టీవీ నిర్మాణంలో వీరాస్వామి కర్రె దర్శకత్వం వహించారు. తిరుపతి కెమెరా, ఉదయ్ కుంభం ఎడిటింగ్ అందించారు. సంఘ్వీర్, రాధిక, రాము, రోహిణి ఆరెట్టి, మిట్టు, విక్రమ్ సూర్య, అనిల్ తదితరులు నటించారు. క్రింది లింకులో మీరూ ఈ వీడియోను చూడవచ్చు.