గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరిగిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన రెండో విడత పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ అంచనాలు అధికార బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. అయితే ఈ ఎన్నికలను ఓ గ్రామంలోని ముస్లిం ప్రజలు బహిష్కరించారు. ఖేడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీనికి అక్టోబర్ 3న జరిగిన గొడవ కారణమైంది. ఆ రోజు ఉంధేలా గ్రామంలోని మసీదు సమీపంలో ఉన్న ఆలయంలో నవరాత్రుల సందర్భంగా గర్భా వేడుకను నిర్వహించారు.
దీనిపై స్థానిక ముస్లిం ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయగా, అనంతరం వేడుకపై సుమారు 150 మంది రాళ్లు విసిరారు. దీంతో విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు రాళ్లు విసిరిన ముస్లిం యువకులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. మొత్తం 43 మందిపై కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా ముస్లిం యువకుల చేతులను స్తంభానికి లాగి కట్టి లాఠీ దెబ్బలతో శిక్షించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల చర్యపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ దౌర్జన్యాన్ని గుర్తు పెట్టుకున్న ముస్లిం ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. సోమవారం జరిగిన రెండో విడత పోలింగులో వారు ఎవ్వరూ ఓటు వేయకుండా తమ నిరసన తెలియజేశారు.