ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కాంబోడియా దేశంలోని అంగ్కోర్ వాట్ దేవాలయం. ఇప్పుడు దాని కంటే పెద్దగా బీహార్లో విరాట్ రామాయణ్ మందిర్ పేరుతో ఓ ఆలయం నిర్మాణమవుతోంది. దాదాపు రూ. 500 కోట్లతో నిర్మించే ఈ ఆలయం కోసం ఓ ముస్లిం కుటుంబం రెండున్నర కోట్ల విలువ చేసే భూమిని ఉచితంగా ఇచ్చింది. ఈ మేరకు ఆలయ నిర్మాణ పనులు చూస్తున్న మహావీర్ మందిర్ ట్రస్ట్ చీఫ్ ఆచార్య కిషోర్ కునాల్ వెల్లడించారు. వ్యాపారవేత్త అయిన అహ్మద్ ఖాన్ కేషారియా సబ్ డివిజన్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ కుటుంబానికి చెందిన భూమిని విరాళంగా ఇస్తూ రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ద కశ్మీర్ ఫైల్స్, తెలంగాణలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన జరగడం మత సామరస్యానికి నిదర్శనంగా భావించవచ్చు. కాగా, ఆలయ నిర్మాణానికి ఇప్పటికరకు 125 ఎకరాలు సేకరించగా, ఇంకో 25 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అంగ్కోర్ వాట్ కంటే 215 అడుగుల ఎత్తులో, ఎత్తైన గోపురాలతో 18 ఆలయాలు నిర్మించనున్నారు. అంతేకాక, ప్రపంచంలోనే అతిపెద్ద శివ లింగాన్ని ఇక్కడ ప్రతిష్టించబోతున్నారు. ఆలయ నిర్మాణానికి కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాను నిర్మాణంలో నిమగ్నమైన నిపుణుల సలహాలు తీసుకోనున్నారు.