కూకట్‌పల్లిలో ప్రైవేటు ట్రావెల్స్‌లో మూడు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం మిస్టరీ వీడింది. పోలీసులు కేసును ఛేదించారు. డ్యూటీకి రానన్న డ్రైవర్‌ను యజమాని చితకబాదినందుకు ప్రతీకారంగా ఈ ఘటన జరిగినట్టు తేలింది. వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి రంగధాముని చెరువు కట్ట దిగువన భారతీ ట్రావెల్స్ గ్యారేజీలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో మూడు ప్రైవేటు టావెల్స్ బస్సులు దగ్ధమయ్యాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా డ్రైవర్ వీరబాబే మూడు బస్సులను తగులబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ట్రావెల్స్ యజమానిపై కక్షతోనే ఇలా చేసినట్లు తెలిపారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన పసుపులేటి వీరబాబు (34) రెండు నెలలుగా బస్సుల యజమాని కృష్ణారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సిందిగా కృష్ణారెడ్డి ఆదేశించారు. అయితే, తాను ఊరికి వెళ్తున్నానని, డ్యూటీకి రానని వీరబాబు చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణారెడ్డి తన సోదరుడి కుమారుడైన యశ్వంత్‌రెడ్డితో కలిసి వీరబాబును ఓ గదిలో బంధించి బెల్టు, కొబ్బరిమట్టతో దాడిచేశాడు. కృష్ణారెడ్డి కొట్టడం వల్లే డ్రైవర్ వీరబాబు ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితుడు వీరబాబుతోపాటు అతనిపై దాడి చేసిన ట్రావెల్స్ యజమాని కృష్ణారెడ్డి, అతని బంధువుపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన రోజు మూడు బస్సులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.