The New York Post interviewed Hadi Matar
mictv telugu

రష్ధీ ఇంకా చావలేదా? హంతకుడి ఆశ్చర్యం

August 18, 2022

The New York Post interviewed Hadi Matar

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. తీవ్రగాయాలపాలైన రష్దీని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అయితే దాడికి పాల్పడిన హాదీ మతార్ (24)ను పోలీసులు పట్టుకొని విచారణ నిమిత్తం జైల్లో ఉంచగా, న్యూయార్క్ పోస్ట్ వారు అతడిని ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో రష్దీ ఇంకా బతికే ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అతడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడనే వార్తలు చూసి విస్మయానికి లోనయ్యానని తెలిపాడు.

రష్దీ తన రచనల ద్వారా ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రవర్తించాడని, ఇస్లామిక్ వ్యవస్థలను దెబ్బ తీయడానికి ప్రయత్నించాడని ఆరోపించాడు. అలాగే రష్దీపై గతంలో ఫత్వా జారీ చేసిన ఇరాన్ నేత ఆయతుల్లా ఖొమేనీని గొప్ప వ్యక్తిగా అభివర్ణించాడు. ఆయన జారీ చేసిన ఫత్వాను అనుసరించి హత్యాయత్నం చేశారా? అని ప్రశ్నించగా సమాధానమివ్వలేదు. అయితే రష్దీ రాసిన పుస్తకం ది శాటానిక్ వర్సెస్ చదివానని, అందులో తనకు కొన్ని పేజీలు నచ్చలేదని, అంతేకానీ, ఖొమేనీకి చెందిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌తో తనకెలాంటి సంబంధం లేదని వెల్లడించాడు. కాగా, రష్దీ రాసిన శాటానిక్ వర్సెస్ పుస్తకం రిలీజయిన రెండేళ్ల తర్వాత హాదీ మతార్ పుట్టడం గమనార్హం.