'చేతి'కి మిగిలింది ఇక ఆ రెండే.. - MicTv.in - Telugu News
mictv telugu

‘చేతి’కి మిగిలింది ఇక ఆ రెండే..

March 10, 2022

16

ఉత్తర భారతదేశంలో గురువారం వెలువడుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతుంది. నూటముప్పై యేండ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రోజురోజుకు తన ప్రభావాన్ని కోల్పుతూ.. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమిపాలు కావడం సాధారణ అంశంగా తయారైంది. నేడు వెలువడుతున్న ఐదు రాష్ట్రాల ఫలితాలలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు.

మరోపక్క ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్న సమయంలో దేశ రాజకీయాల్లో మరోసారి బలమైన శక్తిగా కొనసాగింది. ఇలా 2011 నాటికి 11 రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఢీల్లీ, హరియాణా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్), కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాలైన (అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపుర్, మిజోరం) కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మొత్తం 18 రాష్ట్రాల్లో తన సత్తాను చాటింది.

కేంద్రంలో యూపీఏ కూటమి రెండో పర్యాయం ముగుస్తోన్న సమయంలో దేశ వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచాయి. 2014లో నరేంద్ర మోదీ రాకతో జాతీయ స్థాయిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి.. అప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో జరుగుతోన్న ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి తప్పడం లేదు. పెద్ద రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. తాజాగా పంజాబ్‌లోనూ ఓడిన కాంగ్రెస్ పార్టీ, చివరకు రెండు (రాజస్థాన్, ఛత్తీస్ గఢ్) రాష్ట్రాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు  అంటున్నారు.