అసలే తాగుబోతు ఆపై పాముతో.. చివరికి - MicTv.in - Telugu News
mictv telugu

అసలే తాగుబోతు ఆపై పాముతో.. చివరికి

April 1, 2022

bfbfnb

ఆంధ్రప్రదేశ్‌లో ఓ విచిత్ర సంఘటన వెలుగుచూసింది. సామాన్యంగా మద్యాన్ని తాగే వ్యక్తులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే మద్యం తాగిన తర్వాత మత్తు బాగా ఎక్కుతుంది కాబట్టి. దాంతో కొంతమంది తమ గత జీవితంలో జరిగిన విషాదాలను గుర్తుచేసుకొని, వారిలో వారే మాట్లాడుకుంటారు. మరికొంతమంది మనసులో ఏఏ బాధలు ఉన్నాయో పక్కవారితో చెప్పుకుంటారు. ఇంకొంతమంది తమ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చర్చించుకుంటారు. అంతేకాకుండా మద్యం సేవించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో? ఏం మాట్లాడుతున్నాడో? కూడా అతనికి ధ్యాసే ఉండదు.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో పరాచకాలాడాడు. అదృష్టం కొద్ది ఆ పాము కాటు నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.ద్వారకా తిరుమలకు చెందిన మాణిక్యం ఓ పెయింటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అతను తాగిన మైకంలో ఓ చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్ళాడు.

అక్కడ ఓ నాగుపాము అతని కంట పడింది. మద్యం మత్తులో ఉన్న మాణిక్యం.. పాము దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మ అంటూ ఆ పాముతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ‘నేను ఏమీ చేయను, భయపడకు, మనందరం స్నేహితులమే. ఎందుకు నా మీద బుసబుస లాడుతూ కొప్పడతావు.’అంటూ పామునే ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా దాని తోక పట్టుకునే ప్రయత్నం చేశాడు.

దాంతో ఆ పాముకు తెగ కోపం వచ్చింది. వెంటనే కాటు వేయబోతుండగా అదృష్టం కొద్దీ ఆ కాటు నుంచి తప్పించుకున్నాడు. నన్ను కరిస్తే నీకేమన్నా వస్తుందా అని, మా మీద కోపం వద్దు అంటూ, పోనీ నీకు భయం వేస్తే చెప్పు దూరంగా విడిచి పెడతానంటూ దాన్ని బ్రతిమిలాడడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆకలేస్తే చేపలు తినమని తన దగ్గర ఉన్న చేపను పాముకు పెట్టబోయాడు. చివరికి ఆ పాము అక్కడినుంచి వెళ్లిపోయింది. కొంచెం సేపు తర్వాత మాణిక్యం కూడా అక్కడి నుంచి వెనుదిరిగాడు.