మల్కాజ్‌గిరి చేతిలో రేవంత్‌ భవిష్యత్తు.. ఒడితే కనుమరుగే! - MicTv.in - Telugu News
mictv telugu

మల్కాజ్‌గిరి చేతిలో రేవంత్‌ భవిష్యత్తు.. ఒడితే కనుమరుగే!

March 15, 2019

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్నిపార్టీల అధిష్ఠానాలూ గెలిచే అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. పోటీ చేసేందుకు ముందుకొచ్చిన అభ్యర్థుల జాబితాలను పరిశీలించి సర్వేలు నిర్వహించి, ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నాయి. దేశంలోనే  అత్యధిక ఓటర్లున్న లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో.. అనేక ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.  

2009లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజవర్గంగా ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఎంపీగా టీడీపీ అభ్యర్థి సిహెచ్. మల్లారెడ్డి విజయం సాధించారు. తెలంగాణలో గెలవక గెలవక ఒక్క స్థానం దక్కించుకున్న టీడీపీకి ఆయన రాజీనామా చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది.

 

మల్లారెడ్డి మంత్రి కావడంతో మల్కాజ్ గిరి నుంచి టీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రముఖంగా మర్రి లక్ష్మారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్ అధినేత మర్రి రాజశేఖర్ రెడ్డి, బండి రమేశ్, నవీన్ రావు, బండారు లక్ష్మారెడ్డి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

The Party Is Prepared For The Election Of The Election... Who Won From Malkajgiri....

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి కష్టాల్లో పడిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటు కోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బలమైన అభ్యర్థులను మాత్రమే బరిలోకి దించుతోంది. ఇందుకోసం కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని రంగంలోకి దించుతోంది. ఎమ్మెల్యేగా ఓటమిపాలైన రేవంత్ కూడా ఈసారి ఎలాగైన గెలవాలని పట్టుదలతో ఉన్నారట. అయితే గులాబీ హవా వీస్తుండంతో ఆయన గెలుపు అంత సలభం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. రేవంత్ ఓడిపోతే మటుకు ఆయనకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండకపోవచ్చు. ఆయన బలమైన నాయకుడని చేర్చుకున్న కాంగ్రెస్ ఇకపై ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు.

మల్కాజ్‌గిరిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎల్‌బీనగర్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిగతా ఆరు నియోజవర్గాలైన ఉప్పల్, మల్కాజ్ గిరి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఎల్‌బీనగర్ లో గట్టి ప్రచారం చేసి ఎంపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

గత ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీకి కూడా ఇక్కడి స్థానాన్ని మళ్లీ పోటీ చేయాలని భావిస్తోంది. బీజేపీ కూడా మల్కాజిగిరి స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులు ఎక్కువగా నివసించే ప్రాంత కావడంతో.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మొగ్గు చూపుతారని ధీమాతో ఉంది.