షాపింగ్ మాల్కి వెళ్లిన జనం అక్కడున్న లిఫ్ట్ ఎక్కి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లిఫ్టులో ఇరుక్కొని బయటకు రాలేక నరకయాతన అనుభవించారు. కర్నూలు నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన జ్యోతి మాల్‌కు జనాలు విరివిగా వస్తుంటారు. నిత్యవసరాలతో పాటు వస్త్ర విక్రయాలు, ఇతర వస్తువుల విక్రయానికి ఈ మాల్ ప్రసిద్ధి చెందింది. దీంతో ఈ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు. బుధవారం కొనుగోలు చేయడానికి లిఫ్ట్ ఎక్కిన వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మాల్లోని మొదటి అంతస్తుకు చేరకముందే లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది.
లిఫ్ట్ ఆగిపోయే సమయంలో అందులో ఉన్న జనంలో కొంతమంది కుదుపునకు కింద పడ్డారు. మరికొందరు కేకలు వేశారు. ఈలోగా అక్కడికి చేరుకున్న జ్యోతి మాల్ సిబ్బంది లిఫ్ట్ రిపేర్ చేసే వ్యక్తిని ఫోన్ ద్వారా సంప్రదించారు. అయితే సంబంధిత వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో అరగంట పాటు లిఫ్టులోనే నరకయాతన అనుభవించారు. ముఖ్యంగా లిఫ్ట్‌లో ఉన్న మహిళలు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది జ్యోతి మాల్ మెయింటినెన్స్ మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణ పరిస్థితి ఎదుర్కొన్న మాల్‌కు సంబంధించిన సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.