పైలట్ సిగరెట్ వల్ల 66 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

పైలట్ సిగరెట్ వల్ల 66 మంది మృతి

April 28, 2022

బస్సుల్లో, రైళ్లలో పొగ తాగొద్దని ఎంత హెచ్చరించినా కొందరు పట్టించుకోరు. చివరకు విమానంలోనూ అదే తంతు. ఈ వ్యసనం ఎంత ప్రమాదకరమో చెప్పే ఉదంతం ఇది. పైలట్ సిగరెట్ కాల్చడం వల్ల విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు ఓ కేసు దర్యాప్తులో తేలింది. 2016వ సంవత్సరం మే నెలలో ఈజిప్టు ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం ప్రమాదానికి గురై, చాలామంది చనిపోయారు. ఆ ఘటనకు సంబంధించి, ఇప్పుడు సంచలన విషయాలను ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు.

సరిగ్గా ఆరేళ్ల క్రితం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టు రాజధాని కైరోకు ఈజిప్టు విమానం బయల్దేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్ నుంచి అదృశ్యమైంది. కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలోని తూర్పు మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సిబ్బందితోపాటు 66 మంది ప్రయాణికులు మరణించారు.

అనంతరం ఈ ఘటనపై అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే ఈ ఘటనకు సంబంధించి, ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు 184 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో సమర్పించారు. కాక్‌పిట్‌లో ఉన్న పైలట్ సిగరెట్ వెలిగించగానే, అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీక్ అవడంతో కాక్‌పిట్‌లో మంటలు చెలరేగి, విమానం కూలిపోయిందని నివేదికలో పేర్కొన్నారు.