ఆకాశంలో 525 మంది ప్రాణాలను కాపాడిన పైలట్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆకాశంలో 525 మంది ప్రాణాలను కాపాడిన పైలట్లు..

June 16, 2022

శ్రీలంక దేశంలో పెను ప్రమాదం తప్పింది. ఆకాశంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనే పరిస్థితి ఏర్పడగా, పరిస్థితిని గమనించిన విమానంలోని పైలట్లు అప్రమత్తమై, ఎటువంటి ప్రాణహాని జరగకుండా  525 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం యూఎల్-504 విమానం జూన్ 18న లండన్ నుంచి కొలంబోకు 275 మంది ప్రయాణికులతో బయల్దేరింది. తుర్కియే గగనతలంలో 33 వేల అడుగుల ఎత్తులో వెళ్తున్నప్పుడు 35 వేల అడుగుల ఎత్తుకు ఎగరాలని పైలట్లకు అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కేంద్రం సూచించింది. అదే సమయంలో ఆ ఎత్తులోనే 15 మైళ్ల దూరంలో ఓ విమానం వస్తున్నట్లు శ్రీలంక విమాన పైలట్లు పసిగట్టారు. వెంటనే ఆ విషయాన్ని ఏటీసీ కేంద్రానికి తెలియజేశారు.

ఈ క్రమంలో ఏటీసీ వ్యవస్థ విమానం పైకి ఎగరడానికి అప్పటికే రెండు సార్లు క్లియరెన్స్ ఇచ్చారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు మాత్రం 35 వేల అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకోలేదు. ఆ పైలట్ల నిర్ణయమే ప్రయాణికులకు ప్రాణాలు పోసింది. పొరపాటును ఏటీసీ చెప్పిన ప్రకారం విమానం ఎగిరితే, అదే ఎత్తులో దుబాయ్‌కు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్‌రే చెందిన విమానాన్ని (250 మంది) ఢీకొట్టి, వందల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి అని అధికారులు తెలిపారు.

మరోపక్క పైలట్ల అప్రమత్తతతో తుర్కియే గగనతలంలో భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపరిపీల్చుకున్నారు. రెండు విమానాలు ఢీకొనే పరిస్థితిని పసిగట్టి, 525 మంది ప్రయాణికులను కాపాడినందుకు పైలట్లపై ప్రశంసలు వర్షం కురుస్తుంది.