ఢిల్లీలో ఓ స్పైస్‌జెట్ విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన సంఘటన సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి జమ్ముకాశ్మీర్‌కు ఆ విమానం రాకపోకలు సాగించడానికి అధికారులు షెడ్యూల్ చేశారు. అయితే, టెర్మినల్ నుంచి రన్‌వేకి విమానాన్ని తరలిస్తుండగా పుష్ బ్యాక్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయణికులకు ఏ చిన్న హాని జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. “SG 160 విమానాన్ని ఢిల్లీ నుంచి జమ్మూకి రాకపోకలు సాగించేందుకు షెడ్యూల్ చేశాం. అయితే, టెర్మినల్ నుంచి రన్‌వేకి విమానాన్ని తరలిస్తున్నప్పుడు పుష్ బ్యాక్ టైంలో విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దాంతో ఆ విమానాన్ని వదిలేసి, వేరే విమానాన్ని ఏర్పాటు చేశాం. అయితే సంఘటన జరిగినప్పుడు ప్రయాణికులు విమానంలో ఉన్నారు. కానీ ఎటువంటి హాని జరగలేదు” అని తెలిపారు.
మరోపక్క కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ఎయిర్‌పోర్టులో కూడా ఓ ప్రమాదం తప్పింది. 55 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం కిందకు దిగే క్రమంలో రన్‌వేపై నుంచి పక్కకు జరిగిపోయింది. అయితే, ఎటువంటి ప్రమాదం సంభవించ లేదు. ఫ్లైట్ ATR72-600 ఢిల్లీ నుంచి 55 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందిని తీసుకుని మధ్యాహ్నం 1:15 గంటలకు జబల్పూర్లో దిగాల్సి ఉంది. అలా దిగుతున్న సమయంలో విమానం రన్‌వే నుంచి అదుపు తప్పింది. ఆ విమాన చక్రం రన్‌వేపై కాకుండా పక్కకు జరిగిపోయింది. పైలట్ చాకచక్యంతో ఆ టైర్‌ను మళ్లీ రన్‌వేపై తీసుకొచ్చారు. దీంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.