ఏపీ: ఎస్సైని పరిగెత్తించి కొట్టిన పేకాట రాయుళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ: ఎస్సైని పరిగెత్తించి కొట్టిన పేకాట రాయుళ్లు

April 11, 2022

opolice

పేకాడుతున్నారనే సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుందామని వెళ్లిన పోలీసులపై పేకాటరాయుళ్లు తిరగబడ్డారు. ఎస్సై బట్టలు చింపి పరుగెత్తించి కొట్టారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం యడవల్లిలో గత కొన్ని రోజులుగా పేకాట, కోడిపందాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లారు. వీరిని చూసిన పందెంరాయుళ్లు ఇద్దరినీ దుర్భాషలాడి అక్కడి నుంచి పంపించేశారు. కానిస్టేబుళ్లు విషయాన్ని ఎస్సైకి నివేదించగా, ఆయన ఏఎస్సైతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పంపారు. అయినా, వాళ్లు ఏమాత్రం భయపడకుండా తిరగబడడంతో ఏఎస్సై రాంబాబు ఎస్సైకి కబురంపారు. ఎస్సై దుర్గామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎస్సైని దాడి చేసి, పరుగెత్తించి కొట్టారు. కిందకు లాగేసి చొక్కా చింపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ వెంటనే అక్కడికి చేరుకుని గాయపడిన ఎస్సైని చింతలపూడి ఆస్పత్రికి తరలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు వ్యక్తిగత కక్షతో ఎస్సైపై దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో కొందరిని గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.