Home > Featured > మిడ్ మానేరు నిర్వాసితుల మహా ధర్నా.. ఉద్రిక్తత, అరెస్ట్

మిడ్ మానేరు నిర్వాసితుల మహా ధర్నా.. ఉద్రిక్తత, అరెస్ట్

మిడ్ మానేరు ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులు సోమవారం వేముల వాడలో మహా ధర్నా చేపట్టారు. ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి తమకు పూర్తి స్థాయి పరిహారం అందలేదని, కేసీఆర్ చెప్పినట్టు డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదంటూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన నిర్వాసితులు నంది కమాన్ వద్ద ఆందోళనకు దిగగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాసితులు అక్కడే ధర్నాకు దిగడంతో పోలీసులు, నిర్వాసితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇది దాటి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో నిర్వాసితులు పోలీసు వాహనాలకు అడ్డుగా కూర్చున్నారు. దీంతో పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అటు ఈ ఘటనపై విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్, బండి సంజయ్‌లు స్పందించారు.

‘నిర్వాసితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. పరిహారం కోసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న వారిపై పోలీసుల చర్య దుర్మార్గం. వారికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. హామీ మేరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాల’ని రేవంత్ డిమాండ్ చేశారు. ‘ముంపు బాధితులను పరామర్శిస్తే అరెస్ట్ చేస్తారా? మహిళలు అని కూడా చూడకుండా పోలీసుల దౌర్జన్యం ఏంటి? భూములు త్యాగం చేసిన వారి పట్ల పోలీసుల తీరు చూస్తుంటే కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయనిపిస్తోంది. నిర్వాసితులవి న్యాయమైన డిమాండ్లు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated : 29 Aug 2022 4:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top