రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికల్ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌పై పోలీసులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. రిపోర్ట్‌లో పోలీసులు పలు సంచలన విషయాలను వెల్లడించారు. ఇక మరోవైపు నేటి నుండి నాలుగు రోజుల పాటు సైఫ్ ను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.
అందుకే ఆమెపై కోపం
నిందితుడు సైఫ్ ఫోన్‌లో పోలీసులు పలు వాట్సాప్ చాట్స్‌ను పరిశీలించారు. అందులో అనూష, భార్గవ్, ఎల్డిడీ ప్లస్ నాకౌట్స్ గ్రూప్ చాట్ ను విశ్లేషించారు.19 మంది సాక్షులను విచారించారు. ప్రీతి పడిపోయిన గదిలో ఇంజెక్షన్లతో సహా మొత్తం 24 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ చాట్ ప్రకారం.. అనస్థీషియా డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌గా ఉన్న సైఫ్ అదే డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రీతిపై సూపర్ వైజ్ చేసేవాడు. ఈ క్రమంలో అతను ప్రీతి విషయంలో చేసిన రెండు పనులు ప్రధానంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. డిసెంబర్‌లో జరిగిన ఒక యాక్సిడెంట్ కేస్ లో సైఫ్ వైద్య విద్యార్థిని ప్రీతిని గైడ్ చేశాడు. అయితే అప్పుడు ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాశారు. ఆమె రాసిన రిపోర్టును వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేసిన సైఫ్ ఆమెను అవమానిస్తూ మెసేజ్ పెట్టారు.
కులం పేరుతో అవమానం
ప్రీతికి ఎలాంటి మెడికల్ నాలెడ్జ్ లేదని రిజర్వేషన్ కోటాలో వస్తే ఇలాగే ఉంటుందంటూ..తోటి విద్యార్ధుల ముందు సైఫ్ అవమానించాడని పోలీసులు రిమాండ్ లో తెలిపారు. రిజర్వేషన్ కోటాతో పాటు ఎండీ కోర్సు చేయడానికి కావాల్సిన తెలివిలేదన్నట్లుగా 31 మందితో సీనియర్లు, జూనియర్లు ఉండే ఎల్‍డీడీ, నాకౌట్ వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్లు, ఎమోజీలు పెట్టాడు. ప్రిలిమినరీ అనస్తీషియా రిపోర్ట్ (పీఏసీ) రాయరావడం లేదని క్రిటిసైజ్ చేశాడు. దీంతో ప్రీతి సైఫ్‍కు పర్సనల్ మెసేజ్ పెట్టింది. తానేదైనా తప్పుచేస్తే పర్సనల్ గా చెప్పాలని.. లేదంటే హెచ్‍ఓడీ, జీఎంహెచ్ ఇన్ చార్జ్కు ఫిర్యాదు చేయాలి తప్పితే, ఇలా వేధించొద్దని చెప్పింది. వినకుంటే హెచ్‍ఓడీకి ఫిర్యాదు చేస్తానని చెప్పింది. దీంతో కోపం పెంచుకున్న సైఫ్ ప్రీతిని ఎలా వేధించాలనే దానిపై సీనియర్ భార్గవ్‍తో చాటింగ్ చేశాడు. ఆమెకు సహకరించకుండా తోటి సీనియర్లకు మెసేజ్లు పెట్టినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రీతి అలా మాట్లాడటం.. సైఫ్‌ను ఆగ్రహానికి గురి చేసిందని…. దీంతో మరింత వేధించి అవమానించాలని..నిర్ణయించుకున్నట్లుగా రిపోర్ట్‌లో వెల్లడించారు. గత నెల 21న సైఫ్‌ని పిలిపించిన హెచ్‌వోడీ… పద్ధతి మార్చుకోవాలని అతడిని మందలించారు. ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తెలిసి పారిపోవాలని సైఫ్ ప్రయత్నిస్తుండగా…. అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు.
4 రోజుల కస్టడీ
అయితే ప్రస్తుతం ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్ ను విచారించనున్న పోలీసులకు సైఫ్ ను నాలుగు రోజుల కస్టడీకి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ప్రీతి మృతి కేసులో వారం రోజుల కస్టడీకి పోలీసులు పిటిషన్ వేసినా, ఈ పిటిషన్ విచారించిన జిల్లా కోర్టు సైఫ్ ను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో నేటి నుంచి నాలుగు రోజులు పాటు సైఫ్ ను పోలీసులు విచారించనున్నారు.