లోకల్ నాయకుల స్పీచ్‌లకే పవర్ ఎక్కువ.... - MicTv.in - Telugu News
mictv telugu

లోకల్ నాయకుల స్పీచ్‌లకే పవర్ ఎక్కువ….

October 25, 2018

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ నాయకుల చేత ప్రచారాలు చేయించాలని కాంగ్రెస్, బిజెపిలు అనుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది కూడా. జాతీయ నాయకులను చూసి నిజంగానే జనం ఓట్లు వేస్తారా? రీసెంట్ అనుభవాలు చెప్తున్నదేమిటీ? కిందటి ఎన్నికల్లో జాతీయ  నాయకులు చేసిన ప్రచారాలు ఫలించాయా? మరి ఈసారీ రిజల్ట్ ఉంటుందా?

తాజాగా కాంగ్రెస్ పార్టీ  ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో సభలు నిర్వహించింది. రాహుల్ గాంధీ పర్యటన ద్వారా తమకు బాగా లాభిస్తుందని భావించింది. ప్రయోజనం ఎంత వచ్చిందనే దానికంటే స్థానిక అంశాలపై, జనం నాడీ పట్టుకుని మాట్లాడింది తక్కువే. పైగా  కేసీఆర్ లాంటి బలమైన నాయకుడున్నప్పుడు వైరీ పక్షంలో కూడా అంతే బలమైన స్థానిక నాయకుడుంటేనే సమాధానం ధీటుగా ఇవ్వగలం.The power of the local leaders is moreఅసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ నాయకులు తిరిగి ప్రచారం చేసిన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సూపర్, డూపర్  మెజార్టీలంటూ వచ్చిందేమీ లేదు. మొన్నటి కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి నాయకులు పోటాపోటీగా ప్రచారాలు చేశారు. మోదీ డజన్‌కు పైగా సభల్లో పాల్గొన్నారు. దానికి తోడు స్థానిక నాయకుల   బలం చాలా పనిచేసింది. అయినా అధికారంలోకి రాలేక పోయింది.

రాష్ట్రాల్లో  ప్రాంతీయ పార్టీల వైపే ఓటర్ల చూపు ఎక్కువగా ఉంటుంది. స్థానిక సమస్యలు, స్థానిక రాజకీయనాయకుల ఉపన్యాసాలు, స్థానికంగా ఉండే  సమీకరణలు వీటిపైనే ఓటర్ల దృష్టి ఉంటున్నది. మునుపటిలా పాలసీల గురించి మధ్యతరగతి బాగా దృష్టి పెట్టింది. అదీ ట్యాక్స్‌లకు సంబంధించిన అంశాలపైనా, కేంద్ర ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలపైనా. కానీ ఇప్పుడు పరిస్థితి  చాలా మారింది. స్థానిక ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల గురించే ఓటర్లు ఆలోచిస్తున్నారు.

అందుకే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా జాతీయస్థాయి నాయకుల ప్రచారాల కంటే స్థానిక నాయకుల ప్రచారాల్లోనే వాడీ వేడీ ఎక్కువగా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్,  చత్తీస్‌ఘడ్, మిజోరాంలలో లోకల్ లీడర్, లోకల్ ఇష్యూస్‌పై బాగా మాట్లాడుతున్నారు.

తమ సమస్యలను, పరిష్కారాల గురించి  చెప్పుకుంటున్నారు. జాతీయ నాయకుల స్పీచ్‌లో  చాలా మటుకు ఆయా రాష్ట్రాలకు సంబంధం లేకుండా ఉంటున్నవి. ఓటర్లు వాటి గురించి పెద్దగా పట్టించుకోనట్లే ఉంది.

తాజాగా మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా జాతీయస్థాయి నాయకులు వచ్చినప్పుడు మీడియాలో బాగా హడావిడి ఉంటుంది. కానీ స్థానిక సమస్యలను  గుర్తించి, వాటి గురించి వివరించే విదానం జాతీయ స్థాయి నాయకులకు లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

రాష్ట్రాలకు సంబంధించిన  నాయకుల పరిధి స్థానికంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నాళ్లుగా జనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల గురించి మాట్లాడుతూ ఉండి ఉంటారు కాబట్టి అవి జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి.

బయటి నుండి వచ్చిన  వారికి ఎంత చెప్పినా ఆ తీవ్రత రానే రాదు. కాబట్టి స్థానిక నాయకులే స్థానికంగా ఉండే అంశాల గురించి  బాగా చెప్తారు, మెప్పిస్తారనే అభిప్రాయం జనాల్లో బలపడుతున్నది.