రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి తెలియని వారుండరు. ఉక్రెయిన్ దేశంపై యుద్ధం ప్రకటించిన రోజు నుంచి ఈరోజు వరకూ ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలలో, పత్రికలలో తాజా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పుతిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో వార్త బయటికి వచ్చింది. 69 ఏళ్ల వయసులో పుతిన్ మరోమారు తండ్రి కాబోతున్నట్లు ఓ వార్త సంస్థ వెల్లడించింది.
”మాజీ జిమ్నాస్ట్, ఒలింపిక్ గోల్డ్‌మెడలిస్ట్ అయిన పుతిన్ ప్రియురాలు అలీనా కబేవా (39) త్వరలోనే ఓ అమ్మాయికి జన్మనివ్వబోతుంది. ఆమెకు ఇప్పటికే ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నారు. కానీ, వారి వివరాలను పుతిన్ రహస్యంగానే ఉంచారు. త్వరలోనే మరో ఓ ఆడబిడ్డకు పుతిన్ తండ్రి కాబోతున్నారు. అంటే అలీనా కబేవాకు, పుతిన్ దంపతులకు ఐదవ సంతానంగా మరో బిడ్డ పుట్టనుంది” అని ఆ వార్త పత్రిక తెలిపింది.
మరోపక్క పుతిన్.. మాజీ భార్య లియుద్ మిలాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు మారియా వొరొత్సోవా (37) వ్యాపారవేత్తగా, మరో కుమార్తె కేటెరినా (35) శాస్త్రవేత్త, మాజీ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. పుతిన్ వ్యక్తిగత జీవితం అత్యంత రహస్యంగా ఉంచుతాడని, కేబేవా 2015లో స్విట్జర్లాండ్‌లోని ఓ క్లినిక్‌లో ఓ బాబుకు జన్మనిచ్చినట్టు ‘యూకే మిర్రర్’ పేర్కొంది. అలాగే, 2019లో మాస్కోలో కవలలకు జన్మనిచ్చిందని తెలిపింది. ఈ తాజా విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా వార్తలు రావడంతో పుతిన్ గురించి మరోసారి చర్చ మొదలైంది.