కొండెక్కిన కోడి ధర.. ఇంకా ఎక్కుతుంది - MicTv.in - Telugu News
mictv telugu

కొండెక్కిన కోడి ధర.. ఇంకా ఎక్కుతుంది

March 7, 2022

kodi

తెలంగాణలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. గత ఇరవై రోజుల క్రితం కిలో రూ.175 ఉన్న ధర.. తాజాగా రూ. 280కి పెరిగింది. ఇంకా పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం విక్రయిస్తారని సమాచారం. ఆదివారం రోజున దాదాపు 15 లక్షల కిలోలకు పైగా అమ్ముడు ఉంటోందని. కరోనా భయం తగ్గడంతో గత పది రోజుల్లో రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల కోడి మాంసం అమ్మకాలు జరుగుతాయని వ్యాపార వేత్తలు తెలిపారు.

ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ వాతావరణ మార్పులకు సర్దుబాటు కాలేక కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా ధరలు పెరిగాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర ఏడాది క్రితం రూ.4 వేల నుంచి 5 వేలు ఉండగా.. ప్రస్తుతం 1200 రూపాయలు ఉంది. ఈ కారణాలతో మాంసం ధర పెరిగింది.

మరోపక్క నాటుకోడి మాంసం ధర కిలో రూ. 400 నుంచి 500కి చేరింది. నాటుకోళ్ల లభ్యత లేకపోవడంతో ధర పెరుగుతోంది. మధ్యప్రదేశ్ అడవుల్లో పెరిగే కడక్ నాథ్ కోళ్లను కొందరు వ్యాపారులు తెచ్చి, ఇక్కడి ఫారాల్లో పెంచి కిలో మాంసం రూ.500కి అమ్ముతున్నారు. ఈ మాంసంలో పోషకాలుంటాయనే ప్రచారంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుండటంతో దీని ధర కూడా పెరుగుతోంది.