తెలంగాణ‌లో తగ్గేదేలే అంటున్న చికెన్ ధర - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ‌లో తగ్గేదేలే అంటున్న చికెన్ ధర

March 17, 2022

cccc

తెలంగాణ‌లో చికెన్ ధ‌ర‌లు కొండెక్కాయి. దీంతో సామాన్యుడు చికెన్ కొనాలంటే భయపడే ప‌రిస్థితి ఏర్ప‌డింది. గత నెల రోజుల వ్య‌వ‌ధిలోనే కిలో చికెన్‌పై రూ. 100 పెరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కిలో చికెన్ ధ‌ర రూ. 280 నుంచి రూ. 300 వరకు పెరిగింది. ఈ ధరలు ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య జరుగుతున్న యుద్ధ‌మే కార‌ణ‌మ‌ని.. హ్యాచ‌రీస్ య‌జ‌మానులు పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా హ్యాచ‌రీస్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ కేజీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘బాయిల‌ర్ కోళ్ల‌కు మొక్క‌జొన్న‌, సోయాబీన్‌ను ఆహారంగా ఇస్తుంటారు. అయితే, ఈ రెండింటి ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. కొద్ది వారాల క్రితం కిలో సోయాబీన్ ధ‌ర రూ. 40 ఉండ‌గా, ఇప్పుడు దాని ధ‌ర రూ. 70 ప‌లుకుతోంది. కిలో మొక్క‌జొన్న ధ‌ర రూ. 20 నుంచి రూ. 27కు పెరిగింది. త్వరలోనే దీని ధ‌ర రూ. 30వరకు పెరిగే అవ‌కాశం ఉంది” అని అన్నారు.

అంతేకాకుండా ‘ఈ ధ‌ర‌లు పెర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధ‌మే. ఇండియాలో మొక్క‌జొన్న‌, సోయాబీన్ పండిస్తున్న రైతులు స్వ‌దేశంలోనే మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే, ఉక్రెయిన్ కూడా ఈ రెండు పంట‌ల‌ను అధికంగా పండిస్తోంది. ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేస్తోంది. యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్ నుంచి మొక్క‌జొన్న‌, సోయాబీన్ ఎగుమ‌తులు ఆగిపోయాయి. దీంతో ఇత‌ర దేశాలు. ఇండియాను ఆశ్ర‌యించాయి. ఈ క్ర‌మంలో సోయా, మొక్క‌జొన్న‌కు భారీ డిమాండ్ రావడంతో ధరలు భారీగా పెరిగాయి’ అని కేజీ ఆనంద్ తెలిపారు.

మరోపక్క చికెన్ ధ‌ర‌లు ఇప్ప‌ట్లో త‌గ్గే అవ‌కాశం లేదు. ఈ ప‌రిస్థితి రాబోయే కొద్ది నెల‌ల వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ‌ పౌల్ట్రీ బ్రీడ‌ర్స్ అసోసియేష‌న్ తెలిపింది. ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధంతో పాటు వేస‌కి కూడా తోడైంది. వేస‌విలో కోళ్ల మ‌ర‌ణాలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా చికెన్ రేటు పెరుగుదలకు దోహదపడుతోంద‌ని పేర్కొంది.