The price of cooking oil has risen sharply in Pakistan
mictv telugu

రూ. 555కి చేరిన వంట నూనె లీటరు ధర.. ఎక్కడంటే

June 1, 2022

The price of cooking oil has risen sharply in Pakistan

ముసురుకుంటున్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాక్ ప్రభుత్వం అన్ని వస్తువులపై పన్నులు పెంచుతోంది. ఇటీవలే పెట్రోల్‌పై రూ. 30 లు పెంచింది. తాజాగా వంట నూనెపై రూ. 208 పెంచింది. దీంతో లీటరు వంటనూనె ధర రూ. 555కి చేరింది. అలాగే నెయ్యి కేజీ ధరపై రూ. 213 పెంచగా, ఫలితంగా నెయ్యి కిలో ధర రూ. 605 కి చేరింది. ఎందుకు ధరలు పెంచారనేదానికి పాక్ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ధరలు పెరిగిపోవడంతో పాక్ పౌరులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. ఓ అధికారి చెప్పిన దాని ప్రకారం.. వంట నూనె, నెయ్యి తయారీదార్లకు ప్రభుత్వ సంస్థ రూ. 300కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

దీంతో వారు సరఫరాను ఆపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచినట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం పాక్ వద్ద రెండు నెలల దిగుమతులకు సరిపడా డాలర్లు మాత్రమే ఉన్నాయి. దాంతో పెట్రోల్ వాడకంపై పరిమితులు విధించకుండా వారానికి పనిదినాలను తగ్గించింది. అంతేకాక, దిగుమతి చేసుకునే వస్తువులను చాలా వరకు నిషేధం విధించింది. డాలరుతో పాక్ రూపాయి మారకం విలువ రూ. 200కి చేరడంతో వారు పై చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు ఆ దేశంలో అంతర్యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఇటీవల పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పౌరులను రెచ్చగొడుతున్నారు. ఆయుధాలు పట్టండంటూ ప్రజలకు పిలుపునిస్తున్నాడు. దాంతో మొన్న ఇస్లామాబాద్‌లో జరిగిన విధ్వంస కార్యక్రమంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అంతేకాక, కొంతమంది పార్టీ కార్యకర్తలు ఆధునిక ఆయుధాలతో హల్‌చల్ చేశారు. ఈ విషయం తమకు తెలుసంటూ ప్రభుత్వ నేతలే వ్యాఖ్యానిస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్ధం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ఓ జర్నలిస్టు ‘భారత్‌తో యుద్ధం గురించి ఇంకా ఆలోచించే వ్యక్తులకు చెప్తున్నా. మన దేశంలోని చనిపోదామనుకున్న పౌరులకు ఇంత విషం కొనుక్కోవాలనుకున్నా డబ్బుల్లేవు’ అని వ్యాఖ్యానించాడంటే అక్కడి తీవ్రతను మనం అర్ధం చేసుకోవచ్చు. పాకిస్తాన్ త్వరలో మరో శ్రీలంకలా మారే పరిస్థితులు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.