సికింద్రాబాద్ నుంచి పశ్చిమబెంగాల్ కి వెళ్తున్న రైలెక్కిన ఓ చిన్నారి కుటుంబం గమ్యస్థానం రాగానే దిగిపోయింది. అయితే ఆ రైలులో ఆ చిన్నారి తనకెంతో ఇష్టమైన బొమ్మను మర్చిపోయాడు. రైలు కదిలిన తర్వాత గమనించిన అదే కోచ్ లో ప్రయాణిస్తుండే ఆర్మీ హవల్దార్ విషయాన్ని రైల్వే శాఖకు చేరవేశాడు. వారు తక్షణమే స్పందించి ఓ ప్రత్యేక టీంని రంగంలోకి దింపారు. చివరికి బాలుడి ఇంటికి వెళ్లి బొమ్మను తిరిగి అప్పగించారు. దీంతో రైల్వేశాఖ, ఆర్మీ హవల్దార్ లను నెటిజన్లు, స్థానికులు అభినందించారు. పూర్తి వివరాల్లోకెళితే.. పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్ పుర్ జిల్లా ఖాజీ గ్రామానికి చెందిన దంపతులు ఈ నెల 3న సికింద్రాబాద్ లో అగర్తలా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. దంపతులతో పాటు 19 నెలల అద్నాన్ కూడా వారితో ప్రయాణిస్తున్నాడు. ఆ చిన్నారి రైలులో ఓ ట్రక్కు బొమ్మతో ఆడుకునేవాడు. దాన్ని ఎవ్వరికీ ఇచ్చేవాడు కాదు. ఇదంతా అదే కోచ్ లో ప్రయాణిస్తున్న ఆర్మీ హవల్దార్ విభూతిభూషణ్ పట్నాయక్ గమనిస్తూ ఉన్నాడు.
పిల్లాడు ఆడుకుంటుండంగా ఉత్సాహంగా చూసి ప్రోత్సహించేవాడు. ఈ నేపథ్యంలో బీహార్ లోని కిషన్ గంజ్ స్టేషన్ రాగానే అద్నాన్ కుటుంబం దిగిపోయింది. ఆ స్టేషన్ నుంచి రైలు కదిలాక అద్నాన్ బొమ్మ మర్చిపోయిన విషయాన్ని హవల్దార్ గుర్తించాడు. దాన్ని చేతిలోకి తీసుకొని అద్నాన్ ని తలచుకుంటూ ఎలాగైనా ఆ బొమ్మను అతనికి చేర్చాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే 139 రైల్ మదద్ అనే రైల్వే హెల్ప్ లైన్ ని సంప్రదించగా, వారు ఇదంతా విని అంతే స్పీడుగా రియాక్టయ్యారు. వెంటనే ఓ టీంని రంగంలోకి దింపి రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా అద్నాన్ కుటుంబం అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్లి మరీ ఆ బొమ్మను అద్నాన్ చేతిలో పెట్టారు. పోయిందనుకున్న బొమ్మ తిరిగి చేతికి రావడంతో అద్నాన్ ఆనందం అవధుల్లేకుండా పోయింది. చిన్నారి సంతోషాన్ని చూసిన అద్నాన్ తల్లిదండ్రులు హవల్దార్, రైల్వేశాఖకు ధన్యవాదాలు తెలిపారు.