The reason for 'Liger' to fail is the same: Charmy
mictv telugu

‘లైగర్’ ఫెయిల్ అవ్వటానికి..కారణం అదే: ఛార్మీ

August 29, 2022

తెలుగు చిత్రసీమ పరిశ్రమలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ‘సినిమా తీస్తే, పూరీ జగన్నాథ్‌లా తీయాలి’ అని చాలామంది యంగ్ డైరెక్టర్లు పలుమార్లు స్టేజీలపై చెప్పారు. మరికొంతమంది పూరీ జగన్నాథ్‌ను ఆదర్శంగా తీసుకొని, డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమాపై ప్రేక్షకులు, ఇండస్ట్రీ వాళ్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, వారి అంచనాలను అందుకోలేక ‘లైగర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

అయితే, ఈ లైగర్ చిత్రానికి సహ నిర్మాతగా నటి ఛార్మీ వ్యవహరించారు. తాజాగా సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యింది. అందుకు కారణాలు ఏంటీ అనే విషయంపై ఛార్మీ స్పందిస్తూ, పలు సంచలన విషయాలను వెల్లడించింది.

”జనాలు ఇంట్లోనే కూర్చొని, ఒక్క క్లిక్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, భారీ బడ్జెట్ మూవీలను చూసే పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే సినిమాలు రానంత వరకు వారు థియేటర్లకు రారు. ఒక సినిమా కోసం థియేటర్‌కి రాకముందే అనేక అంశాలపై ప్రేక్షకులు దృష్టి సారిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి మేము ‘లైగర్’ చిత్రాన్ని నిర్మించాము. కానీ, ఫలితం నిరాశకు గురి చేసింది. 2019లో మేము బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్‌ను కలిశాము. 2020 జనవరిలో సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాం. కరోనా కారణంగా మూడు సంవత్సరాల తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో అడ్డంకులను దాటుకుని, ఎంతో నమ్మకంతో సినిమాను విడుదల చేశాం. కానీ, సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యిందో అర్థంకావటం లేదు. జాగ్రత్తగానే రూపొందించాం. కానీ, చిత్రీకరణ సమయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అనిపిస్తోంది. ఆ బాధ ఇప్పుడు అందరినీ బాధిస్తుంది” అని ఆమె అన్నారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ చిత్రంలో.. విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా నటించారు. ఇతర పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ నటించారు. ఈ సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా, ఛార్మీ సహ నిర్మాతగా వ్యవహరించారు.