The robbers fled in a car and hit an electric pole met Road accident
mictv telugu

దొంగలించిన కారులో వెళ్తూ స్తంభాన్ని ఢీకొట్టారు

November 22, 2022

పక్కా ప్లాన్‌తో పార్క్ చేసి ఉన్న కారును దొంగలించారు ఆ ఇద్దరు దొంగలు. దానిని ఎలాగైనా అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ఆనందంలో అతి వేగంతో ఓ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఇంకేముంది.. సీన్ కట్ చేస్తే పోలీసుల అదుపులో ఆస్పత్రి బెడ్ మీద ఉన్నారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఆ ఇద్దరిలో ఒకరు పోలీసుల నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడు. ములుగు జిల్లా మంగపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిందీ సంఘటన.

జిల్లాలోని తాడ్వాయి మండలం వీరాపురం గ్రామానికి చెందిన చీరల సందీప్‌, రాజ్‌కుమార్‌లు.. ఏటూరునాగారంకు చెందిన సయ్యద్‌ అప్సర్‌ కారు దొంగలించి తీసుకెళ్తుండగా మంగపేట మండలం గంపోనిగూడెం వద్ద విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు గాయపడడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాజ్ కుమార్.. ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్న 108 డ్రైవర్‌(గడ్డం దశరథం) బైక్‌ను తీసుకొని ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. పోలీసులకు చిక్కినట్లే చిక్కి బైక్‌పై పారిపోయిన ఆ వ్యక్తి వివరాలు సోమవారం రాత్రి వరకు కూడా తెలియలేదు. దీంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది, బైక్‌ యజమాని తలలు పట్టుకుంటున్నారు.