The RTC driver who stopped the bus on the road and ran away with the ticket money
mictv telugu

ఏపీ.. బస్సును రోడ్డుపై ఆపేసి టిక్కెట్ల డబ్బులు తీసుకొని పరారైన ఆర్టీసీ డ్రైవర్

October 19, 2022

ఏపీలో ఓ ఆర్టీసీ డ్రైవర్ దారుణంగా ప్రవర్తించాడు. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సును నడి రోడ్డుపై ఆపేసి టిక్కెట్ల డబ్బులు తీసుకొని పరారయ్యాడు. దీంతో షాకయిన ప్రయాణీకులు బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే గడిపారు. విజయవాడ నుంచి నూజివీడుకు బయల్దేరిన నాన్ స్టాప్ బస్సుగా గుర్తించిన అధికారులు.. మరో బస్సును హుటాహుటిన ఏర్పాటు చేసి 40 మంది ప్రయాణీకులను తరలించారు. పరారైన డ్రైవరును ఔట్ సోర్సింగ్‌పై పని చేస్తున్న రమేష్‌గా గుర్తించారు. ప్రయాణీకుల వద్ద వసూలు చేసిన డబ్బు లెక్క తేలాల్సి ఉంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, తమతో కూడా దురుసుగా ప్రవర్తించాడని ప్రయాణీకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు నిర్లక్ష్య వైఖరిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు అతడిని విధుల నుంచి తొలగించారు. అటు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలతో ఆర్టీసీపై నమ్మకం పోతోందని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.