శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన సమతా స్పూర్తి కేంద్రం సందర్శనను రద్దు చేస్తున్నారు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు సందర్శనను నిలిపివేస్తున్నట్టు సమతామూర్తి కేంద్రం ప్రకటించింది. మండల అభిషేకాలు, ఆరాధనలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి యథావిధిగా సందర్శనకు అనుమతివ్వనున్నట్టు వెల్లడించింది. ఎప్పటిలాగే ప్రతీ బుధవారం సెలవు ఉంటుందనీ, ప్రవేశ రుసుంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రతీరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని తెలిపింది. ఇంతకు ముందులాగే కేంద్రంలోకి మొబైల్ ఫోన్, కెమెరాలకు అనుమతిలేదని పునరుద్ఘాటించింది. కాగా, సమతా మూర్తి విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా చిన జీయర్ స్వామీజికీ, సీఎం కేసీఆర్‌ల మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిని మీడియా సాక్షిగా కేసీఆర్ ఖండించారు.