ఈ ఏడాది రంజాన్ మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో, మసీదుల నుండి అజాన్ యొక్క స్వరం వినిపిస్తుంది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియాలో అది వినిపించదు. అవును సౌదీ అరేబియాలోని మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ నిబంధనల ప్రకారం సౌదీలో లౌడ్ స్పీకర్లను పూర్తిగా నిషేధించనున్నారు. అలాగే, అజన్ ప్రత్యక్ష ప్రసారం కూడా ఉండదు. సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్‌కు చెందిన మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్ ఎక్కడ వినియోగిస్తున్నారో అక్కడ ఆపకూడదని, ఎక్కడ లేని చోట లౌడ్ స్పీకర్ అవసరం లేదని చెప్పారు. భారతదేశానికి ఉదాహరణగా మౌలానా రిజ్వీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశంలో మసీదులపై లౌడ్ స్పీకర్లను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో అలాంటి పరిమితి లేదు. సౌదీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
భారతదేశంలో హైకోర్టు ఆదేశాల తర్వాత గతంలో లౌడ్ స్పీకర్ల మోత తగ్గింది కానీ లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించలేదన్నారు. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచం మొత్తం ఆగ్రహంగా ఉందని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. లౌడ్ స్పీకర్లతోపాటు ఫొటోగ్రఫీ, మసీదులలో ఇఫ్తార్ విందు కూడా ఉండదు. ఇఫ్తార్ కోసం విరాళాల సేకరణ కూడా నిషేధించబడింది. ఇవే కాదు అజాన్ సమయంలో పిల్లలను మసీదులకు తీసుకెళ్లడం కూడా సౌదీలో నిషేధించారు.