జార్ఖండ్‌లోని పాలము జిల్లా పంకిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గురువారం పారామిలటరీ బలగాలు ఫ్లాగ్‌మార్చ్ చేపట్టాయి. దీంతో ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. కాగా గురువారం పంకిలోని ఏ ప్రాంతంలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, 145 మందిపై కేసు నమోదు చేశామని, 500 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ హింసాకాండలో ఐదుగురు పోలీసులతో సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. ఒక ఇల్లు, రెండు బైక్‌లు, రెండు దుకాణాలను ఆందోళనకారులు తగులబెట్టారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. దియోఘర్‌లో శివరాత్రి సందర్భంగా 144 సెక్షన్ విధించడం, శివ బారాత్ మార్గాన్ని మార్చడంపై దాఖలైన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు ఇవాళ విచారించనుంది.
బుధవారం తెల్లవారుజామున జరిగిన హింసాకాండ తర్వాత, పాలము జిల్లాలో 24 గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని అన్ని టెలికాం కంపెనీలను హోం శాఖ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే, గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఇంటర్నెట్‌ను పునరుద్ధరించే బదులు, ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను మూసివేయాలని నిర్ణయించారు.
తోరణం కోసం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శివబారాత్‌కు తోరణ ద్వారం అలంకరణ విషయంలో బుధవారం ఉదయం పంకిలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో భారీ పోలీసు బలగాలు మోహరించాయి. లాఠీఛార్జ్ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫిబ్రవరి 18 మహాశిరాత్రి, శివుని ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దెత్తున పాల్గొంటారు. రోడ్లపై జనాలు గుమిగూడే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని హోం శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ అరుణ్ ఎక్కా ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.