అత్తతో అసభ్యకరంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఒంగోలు జిల్లా రెండో అదనపు జడ్జి ఎంఏ సోమశేఖర్ సోమవారం తీర్పునిచ్చారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటన వివరాలు ప్రాసిక్యూషన్ మేరకు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన కోలా జాన్ అనే వ్యక్తి చీరాలకు చెందిన చెప్పుల దుకాణం నిర్వహించే మహిళ కూతురితో వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం. అయితే జాన్ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తుండేవాడు. కొన్నాళ్లు ఓపిగ్గా భరించిన భార్య.. విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జాన్ తన అత్తకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించేవాడు. చివరకి తెగించి ఎలాగైనా భార్యను తెచ్చుకుందామని చీరాల అత్తారింటికి వచ్చాడు. ఆ సమయంలో అత్త మాత్రమే ఇంట్లో ఉండగా, అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకు వచ్చింది. అనంతరం భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేరం జరిగినట్టు నిరూపణ అవగా, ముద్దాయి జాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. ఒకవేళ జరిమానా కట్టకపోతే అదనంగా ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలంటూ తీర్పు ఇచ్చారు.