మదర్స్ డే వీడియో : చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

మదర్స్ డే వీడియో : చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని సర్‌ప్రైజ్ ఇచ్చిన కొడుకు

May 10, 2022

మదర్స్ డే రోజును సెలెబ్రేట్ చేసుకున్న వ్యక్తులు మహా అయితే ఏం చేసి ఉంటారు. అమ్మ తమకు చేసిన మంచి పనులను స్టేటస్‌గా పెట్టుకోవడమో లేదా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడమో చేసి ఉంటారు. మరీ లేదంటే చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ఉంటారు. కానీ, మనం చెప్పుకోబోయే కొడుకు తన తల్లికి ఇచ్చిన సర్‌ప్రైజ్ మాత్రం ఎవ్వరూ ఇవ్వలేనిది. వివరాల్లోకెళితే.. అమన్ ఠాకూర్ అనే 24 ఏళ్ల కొడుకుని చిన్నప్పటి నుంచి అతని తల్లి ఎంతో కష్టపడి పెంచింది. ఒకవైపు తాను ఉద్యోగం చేస్తూ కొడుకుని విమాన పైలట్ చేయాలని తపించింది. అందుకు తగ్గట్టే అమన్ చాలా కష్టపడి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్ ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అమన్ తల్లి కూడా పైలటే. అదే కంపెనీలో పనిచేస్తోంది. అయితే మదర్స్ డే నాడు కొడుకు అమన్ తన తల్లి నడిపే విమానానికి కోపైలట్‌గా నియమింపబడ్డాడు. తల్లి పైలట్ అయితే కొడుకు కో పైలట్ అన్నమాట. అంటే తల్లీకొడుకులు ఇద్దరూ ఒకే విమానాన్ని నడుపుతున్నారు. ఈ విషయం తల్లికి ముందుగా చెప్పకుండా డైరెక్టుగా విమానంలోకి ఎంట్రీ అయి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అంతేకాక, అక్కడున్న ప్రయాణీకులతో ‘24 ఏళ్ళుగా నా తల్లితో కలిసి పలు విమానాల్లో ప్రయాణం చేశాను. అయితే ఈ రోజు ప్రత్యేకమైనది. మా అమ్మ పైలట్‌గా ఉన్న ఫ్లైట్‌కి నేను కో పైలట్‌గా వచ్చాను. నాకోసం ఇన్ని ఏళ్లు కష్టపడిన అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని అనడంతో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా, తల్లీకొడుకులు పైలట్, కోపైలట్‌గా పని చేసిన చరిత్ర ఇంతకుముందు దాదాపు లేదనే చెప్పాలి. భవిష్యత్తులో సాధ్యపడుతుందేమో చూడాలి.