ఇది 1992 నాటి సంఘటన. ఓ వ్యక్తి అసభ్య ఫోటోలతో స్కూలు, కాలేజీ విద్యార్ధినులను బ్లాక్ మెయిల్ చేసి వారిపై అత్యాచారాలను పాల్పడ్డాడు. దీనిపై వార పత్రిక ఒకటి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దాదాపు వంద మంది అమ్మాయిలపై అఘాయిత్యం జరిగిందని వార్తలు రావడంతో అప్పట్లో ఈ వార్త అంతర్జాతీయంగా వైరల్ అయింది. దాంతో వారపత్రిక యజమానిపై కక్ష కట్టిన నిందితుడు అతడిని దారుణంగా హత్య చేశాడు. అప్పడు చిన్న పిల్లలుగా ఉన్న పత్రికా యజమాని ఇద్దరు కుమారులు 31 ఏళ్ల తర్వాత తండ్రిని చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడం కలకలం రేపుతోంది.
సినిమా కథకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన రాజస్థాన్ లోని పుష్కర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే.. 1992లో మదన్ సింగ్ అనే వ్యక్తి వార పత్రికను నడిపేవాడు. అప్పట్లో అజ్మీర్ అనే వ్యక్తి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారాలకు పాల్పడుతుండడంతో తన పత్రికలో మదన్ సింగ్ వరుస కథనాలు ప్రచురించాడు. దాదాపు వందమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని తన కథనాల్లో వివరంగా రాసేవాడు. దాంతో నిందితుడు అజ్మీర్ మదన్ సింగ్ పై కక్ష కట్టి చంపాలని దాడి చేశాడు.
కానీ చావు నుంచి తప్పించుకొని గాయాలతో బయటపడిన మదన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, అజ్మీర్ మరోసారి దాడి చేసి ఈ సారి విజయవంతంగా హతమార్చగలిగాడు. అప్పుడు మదన్ సింగ్ ఇద్దరు కుమారులు ధర్మ (12), సూర్య (8) చిన్నవారు. ఈ కేసులో కాంగ్రెస్ యువజన నేతల పేర్లు వినపడడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పొందింది. కేసు సుదీర్ఘకాలంపాటు విచారణ కొనసాగి నిందితులైన సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్ లు నిర్దోషులుగా 2012లో బయటపడ్డారు.
కానీ, మదన్ సింగ్ కుమారుల పగ వయసుతో పాటు పెరిగి పెద్దదవుతూ వచ్చింది. తన కుమారుడి పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు ఓ రిసార్టుకు వచ్చిన సవాయ్ సింగ్ పై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా చనిపోగా, సూర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మ తప్పించుకున్నాడు. అయితే విచారణలో ఇద్దరు అన్నదమ్ములు కూడా మామూలు వారేం కాదని దోపిడీ, బెదిరింపులు, ల్యాండ్ మాఫియా వ్యవహారాల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏది ఏమైనా తండ్రి హత్యకు 31 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకోవడం స్థానికంగా సంచలనమైంది.