తన విగ్రహాన్ని ముందే తయారు చేయించుకున్న బాలు!  - MicTv.in - Telugu News
mictv telugu

తన విగ్రహాన్ని ముందే తయారు చేయించుకున్న బాలు! 

September 26, 2020

The sp balu who made his statue in advance!

తాను బతికుండగానే తన విగ్రహాన్ని గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చూసుకోవాలనుకున్నారు. తన విగ్రహాన్ని తానే తయారు చేయించుకున్నారని ఓ శిల్పి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో శిల్పి రాజ్‌కుమార్‌ వడియార్‌ బాలు  విగ్రహాన్ని చెక్కారు. తన తల్లిదండ్రుల మీద ప్రేమతో నెల్లూరులోని వేద పాఠశాలలో వారి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు బాలు ఆ పనిని కొత్తపేటలోని శిల్పి వడియార్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో బాలు తండ్రి విగ్రహాన్ని తయారు చేసి పంపగా ఆ విగ్రహ ఆవిష్కరణను బాలు పూర్తిచేశారు. తల్లి విగ్రహాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే తల్లి విగ్రహాన్ని చూసేందుకు 2019 నవంబరులో కొత్తపేట వచ్చిన బాలు తన విగ్రహాన్ని కూడా తయారు చేయాలని కోరటంతో రాజ్‌కుమార్‌ వడియార్‌ నమూనా విగ్రహాన్ని తయారు చేస్తానని చెప్పారు. అయితే బాలు విగ్రహం తయారీ దశలో ఉండగానే బాలు చనిపోయారు. 

దీంతో చేసిన నమూనా విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వేగంగా ఈ విగ్రహం పనులు పూర్తి చేసి చైన్నెలోని ఆయన నివాసానికి పంపిస్తాను అని వడియార్‌ చెప్పారు. కాగా, నాలుగు దశాబ్దాలుగా దేశంలోని 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి అలరించారు.  ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన ఆయన గత కొద్ది రోజులుగా కరోనాతో పాటు ఇతర సమస్యలతో పోరాడుతూ నిన్న మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అభిమానులు, అన్ని రంగాల ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ తమిళనాడులో ఆయన అంతక్రియలు నిర్వహించనున్నారు.