The speed of trains has increased..130 km per hour, those trains are these
mictv telugu

రైళ్ల వేగం పెరిగింది..గంటకు 130 కి.మీ, ఆ రైళ్లు ఇవే

September 12, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న దక్షిణ మధ్య రైల్యే అధికారులు రైలు ప్రయాణికులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. సికింద్రాబాద్‌, విజయవాడ, గుంతకల్‌ డివిజన్లలోని అధిక సెక్షన్లలో సోమవారం నుంచి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయని తెలియజేస్తూ, ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ఆ ప్రకటనలో ఏఏ డివిజన్‌ల మధ్య ప్రయాణించే రైళ్లలో వేగం పెంచారో ఆ రైళ్ల వివరాలను తెలియజేశారు. ”సికింద్రాబాద్‌ డివిజన్‌లోని సికింద్రాబాద్‌- కాజీపేట-బల్హర్షా, కాజీపేట్‌-కొండపల్లి, విజయవాడ డివిజన్‌లోని కొండపల్లి- విజయవాడ-గూడూరు, గుంతకల్‌ డివిజన్‌లోని రేణిగుంట- గుంతకల్‌- వాడి సెక్షన్లలో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి” అని అధికారులు పేర్కొన్నారు.

అంతేకాదు, ఈ సెక్షన్లలో గరిష్ఠ వేగం పెంపు అనుమతులు వచ్చిన ఫలితంగా ప్యాసింజర్‌ రైళ్లతోపాటు సరుకు రవాణా గూడ్స్‌ రైళ్ల సగటు వేగం కూడా పెరుగుతుందని సూచించారు. ఇందుకు కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బందిని జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌కుమార్‌ జైన్‌ ప్రత్యేకంగా అభినందించారు.