పండగకు పక్షం రోజుల ముందే.. బతుకమ్మ చీరల పంపిణీ షురూ - MicTv.in - Telugu News
mictv telugu

పండగకు పక్షం రోజుల ముందే.. బతుకమ్మ చీరల పంపిణీ షురూ

September 27, 2020

మరో పక్షం రోజుల్లో బతుకమ్మ పండగ ఉండగా అప్పుడే చీరల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు మొదలు పెట్టారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ పంచాయతీలలో బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలు అందరికీ ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకూ చీరలను అందిస్తున్నారు. 99 లక్షల చీరలను సిరిసిల్ల ప్రాంత నేతన్నలతో తయారు చేయించారు. ఇందుకోసం రూ.317.81 కోట్లు కేటాయించారు. 287 డిజైన్లలో చీరలను తయారు చేశారు. 

చీరల పంపిణీపై సిద్దిపేట వస్త్ర చేనేత విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. ‘సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 3.69 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా గుర్తించాం. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఇప్పటివరకు 2.84 లక్షల చీరలను అందజేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయంతో అన్ని మండల ప్రధాన కార్యాలయాలకు చీరలను పంపించాం. మిగతా చీరలను మరో పది రోజుల్లో చేరవేయనున్నాం. బతుకమ్మ పండుగ వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముగించనున్నాం. ఆదివారం నాడు దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరలను పంపిణీ చేశాం. చివరి నిమిషంలో గందరగోళాన్ని నివారించేందుకే ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పక్షం రోజుల ముందే చీరల పంపిణీకి పూనుకుంది’ అని వెంకటరమణ తెలిపారు. కాగా, కరోనా ప్రభావం ఉన్నందున చీరలను ఏ విధంగా పంపిణీ చేయాలన్న విషయమై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గతంలో రేషన్‌ దుకాణాల ద్వారా చీరలను పంపిణీ చేసేవారు. కానీ, ఈసారి చీరలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు చేర్చాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో చీర ధర రూ.320 విలువ ఉంటుంది.