అందాల రాశి కోసం అలుపెరగని యుద్ధం - MicTv.in - Telugu News
mictv telugu

అందాల రాశి కోసం అలుపెరగని యుద్ధం

February 7, 2018

రాజ్యం వీరభోజ్యం.. అట్లనే దమ్మున్నవాడిదే దిల్ కీ ధడ్కన్.. రాజ్యం కోసం కత్తిపట్టిని వాడిని రాక్షసుడు అనలేం, ప్రేమ కోసం ప్రాణాలు తీసినవాళ్లను హీరోలుగా చూడలేం. కాని అధికారాన్నైనా, అమ్మాయినైనా గెలుచుకోవాలన్నా, నిలుపుకోవాలన్నా రొమ్ము విరిచి రోషం చూపించాల్సిందే.

ఎవ్రీ థింగ్ ఈజ్ ఫేయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అందుకే క్రీస్తు పూర్వం జరిగిన ఓ రాణిప్రేమపురాణంలో తప్పు ఒప్పొప్పులను నిర్ణయించేందుకు కాలం కూడా సందేహించింది. ఆనాడు జరిగిన దారుణాన్ని మౌనంగా చరిత్ర పునాదుల్లో కప్పేసింది. అందాల రాశి కోసం జరిగిన ఆ అలుపెరగని యుద్ధాన్ని పుక్కటి పురాణంగా వర్తమానానికి పరిచయం చేసింది. కాని తాను చూసిన ఆ అమరప్రేమను ఆ పునాదులు గానం చేశాయి. వేలాది మందికి ఉరితాడైన ఆ ప్రేమను ఈ తరానికి పరిచయం చేశాయి. ట్రోజన్ వార్ లో నామరూపాల్లేకుండా పోయిన ట్రాయ్ ను నిజం చేశాయి.

ప్రాణాలు తీసిన పుట్టుక

ట్రోజన్ కింగ్ ప్రయామ్ భార్య హెకూబా ఓ పిల్లాడికి జన్మనివ్వడంతో ట్రాయ్ కథ మొదలవుతుంది. అప్పటికే ప్రయామ్ కు ముగ్గురు పిల్లలు. హెక్టర్, హెలెనస్ అబ్బాయిలైతే కసండ్రా అమ్మాయి. భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే తెలుసుకునే దివ్యశక్తి కసండ్రాకు ఉండేది. హెకూబా మరో పిల్లాడికి జన్మనిచ్చేటప్పుడు కసండ్రాకు అన్నీ అపశకునాలే కనిపించాయి. ట్రాయ్ ఆకాశంలో మృత్యుదేవత చక్కర్లు కొడుతున్నట్టు అనిపించింది.

ఆ పిల్లాడు బతికి ఉంటే ట్రాయ్ సర్వనాశనమవుతుందని తండ్రితో చెప్పింది. అప్పటిదాకా కసండ్రా చెప్పినవన్నీ జరగడంతో మరో ఆలోచన లేకుండా పిల్లాడిని చంపాలని ప్రయామ్ ఆదేశించాడు..అయితే పసిగుడ్డును చంపడానికి సైనికులకు మనసు రాదు. దీంతో ఆ పసివాడు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఓ పశువుల కాపరి ఇంట్లో పారిస్ పేరుతో పెరిగాడు. యుక్తవయసులో ఏదో పని మీద ట్రాయ్ కు వెళ్లిన పారిస్ ను తండ్రి ప్రయామ్ గుర్తుపట్టాడు. గుండెలకు హత్తుకుని యువరాజును చేశాడు. ఆ క్షణమే ట్రాయ్ అంతానికి ఆరంభం మొదలైంది.

తొలిచూపులోనే ప్రేమ

గ్రీకు పురాణాల ప్రకారం యూరప్, ఆసియా మధ్యలో ట్రాయ్ ఉంటుంది. ఏజియన్ సముద్ర తీర ప్రాంతంలో గ్రీకులదే పైచేయి. మైసీనీ దేశరాజు అగమెమ్నన్ అనధికార గ్రీకు చక్రవర్తి. ట్రోజన్ కింగ్ ప్రయామ్ ఒక్కడే అతడికి లొంగలేదు. గ్రీకు, అరబ్బుల మధ్య వ్యాపారానికి ప్రధాన కేంద్రం అయిన ట్రాయ్ ను లొంగదీసుకుంటే తనకు ఎదురు ఉండదనుకున్నాడు అగమెమ్నన్. అతడి ఆలోచనలను పసిగట్టిన ప్రయామ్, గ్రీకు దేశాలతో స్నేహం చేయాలనుకున్నాడు. అగమెమ్నన్ తమ్ముడైన స్పార్టా రాజు మెనెలేయస్ తోనే ముందు వ్యాపారం చేయాలనుకున్నాడు. అతడిని ఒప్పించే బాధ్యతను యువరాజు పారిస్ కు అప్పగించాడు.

స్పార్టా రాజుగా కాదు అందాలరాశి భర్తగానే మెనెలేయస్ ను గ్రీకు దేశాల్లో ఫేమస్. అప్సరసలను మించిన అందాలరాశి హెలెన్. ఆమె కొంటె చూపుకు మహా యోధులు కూడా గులామ్ అయ్యేవారు. హెలెన్ ను సొంతం చేసుకోవాలని అగమెమ్నన్ సహా ఎందరో గ్రీకు రాజులు ప్రయత్నించారు. కానీ ఆ అదృష్టం మెనెలేయస్ కే దక్కింది. అయితే శరీరాన్ని మెనెలేయస్ కు అప్పగించి, తన మనసుకు నచ్చినవాడి కోసం హెలెన్ ఎదురుచూసింది. ఆ రోజు రానేవచ్చింది.. ఒప్పందం కోసం స్పార్టాకొచ్చిన పారిస్, తొలిచూపులోనే హెలెన్ ను ప్రేమించాడు. పారిస్ ను చూసి హెలెన్ చూపు తిప్పుకోలేపోయింది. పీకల్లోతు ప్రేమలో మునిగింది. వేరొకరరి భార్య అన్న సంగతిని కూడా పట్టించుకోకుండా పారిస్ తో పారిపోయింది. స్పార్టాలో మెనెలేయస్ లేకపోవడాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంది.

మృత్యుదేవుతను మురిపెంగా ఆహ్వానించి ట్రాయ్

 

ఆడది వస్తానంటే వద్దనడం వీరత్వం అనిపించుకోదని గ్రీకుల నమ్మకం. అందుకే శత్రువు భార్యను తీసుకొచ్చినా.. కొడుకును ప్రయామ్ మందలించలేదు. కోడలిగా వచ్చిన హెలెన్ కు ట్రాయ్ లో అపురూప స్వాగతం లభించింది.. రాజ్యంలో అందరూ పండగ చేసుకున్నారు. కానీ కసాండ్రా మాత్రం కీడును శంకించింది. అక్కడ స్పార్టాలో మెనెలేయస్ కోపం కట్టలు తెంచుకుంది. ఒక ఆడది తనను వద్దనుకుని మరొకడితో వెళ్లిపోవడం ఘోర అవమానంగా భావించాడు. రాయబారిగా వచ్చి తన భార్యను లొంగదీసుకున్న పారిస్ ను ముక్కలు ముక్కలు చేస్తానని శపథం చేశాడు. అందుకు సాయం చేయాలని అగమెమ్నన్ ను కలిశాడు.ట్రాయ్ ను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అగమెమ్నన్ సరే అన్నాడు. మొత్తం గ్రీకు రాజ్యాలను ఏకం చేశాడు. గోడవలను పక్కనపెట్టిన గ్రీకు రాజులు మెనెలేయస్ కు జరిగిన అవమానాన్ని తమదిగా భావించారు.  

ఇథాకా రాజు ఒడిస్సియస్ తో పాటు ఎందరో గ్రీకు వీరులు ట్రాయ్ పై యుద్ధానికి సిద్దమయ్యారు. కానీ అదంత సులభం కాదని వాళ్లకూ తెలుసు. ప్రయామ్ పెద్ద కొడుకు హెక్టర్ తెలివి, సాహసం ముందు తమ వ్యూహాలు పనిచేయవని అగమెమ్నన్ తో పాటు గ్రీకు రాజులు భావించారు. శత్రువును ట్రాయ్ కోట గోడలక ఆవలే అంతం చేసిన చరిత్ర హెక్టర్ ది. అందుకే ఒంటిచేత్తో యుద్ధాన్ని గెలిపించే అకిలీజ్ సహాయం కోరారు.

అకిలీజ్ ఓ మృత్యు బేహారీ

గ్రీకు వీరుల్లో అకిలీజ్ అంత మొనగాడు ఎవ్వడూ లేడు. కత్తి పడితే మృత్యువు కూడా ప్రాణాలు తీస్తూ తీస్తూ అలసిపోతుంది. కానీ అగమెమ్నన్ అంటే అకిలీజ్ కు పడదు..ఒడిస్సియస్ రంగంలోకి దిగాడు.. గ్రీకులకు ట్రోజన్ వార్ ఎంత కీలకమో వివరించాడు. పేరు, ప్రతిష్టల కోసం ఎంత సాహసమైనా చేయడం అకిలీజ్ నైజం. ట్రోజన్ యుద్ధం చరిత్ర సృష్టిస్తుందని అకిలీజ్ భావించాడు. ఆ వీరోచిత పోరాటంలో తనకూ భాగం ఉండాలనుకున్నాడు. అందుకే అగమెమ్నన్ అంటే పడకపోయినా యుద్ధానికి వస్తానన్నాడు. ఈ నిర్ణయానికి ముందు తన తల్లి అనుమతి తీసుకున్నాడు.

దేవుళ్లు శాసించారు-గ్రీకులు పాటించారు

ట్రాయ్ పై యుద్ధానికి వెయ్యి ఓడల్లో గ్రీకు సైన్యం బయలుదేరింది. ప్లేగువ్యాధి విజృంభించడంతో గ్రీకు సైనికులు చాలా మంది మధ్యలోనే చనిపోయారు. ప్లేగును గ్రీకులు అపశకునంగా భావించారు. దేవుళ్లకు కోపం వచ్చింది. శాంతి చేయానుకున్నారు. అగమెమ్నన్ కూతురు ఇఫిజెనాయాను దేవుళ్లకు బలివ్వాలని పూజారులు సూచించారు. ట్రాయ్ ను గెలవడానికి దేనికైనా తెగిస్తానన్న అగమెమ్నన్ కూతుర్ని బలిచ్చి గ్రీకు సైన్యాన్ని ముందుకు నడిపిస్తాడు. కానీ గ్రీకు రాజులెవరికీ ట్రాయ్ ఎక్కడుందో తెలియదు. అందుకే గ్రీకు సైన్యం సముద్రంలో దారి తప్పి ఎక్కడెక్కడో తిరిగి సంవత్సరం తరువాత ట్రాయ్ చేరుతుంది.

ట్రోజన్ యుద్ధం మనుషుల మధ్యే జరిగినా దానికి కర్త, కర్మ, క్రియ గ్రీకు దేవుళ్ళే. చంపేది ఎవరైనా చంపించింది మాత్రం పైవాడే. హోమర్ రాసిన ఇలియడ్ తో పాటు ఎన్నో పురాణాల్లో ఈ విషయం క్లియర్ గా ఉంది. యుద్ధంలో మానవాతీత శక్తుల ప్రమేయంపై పురాణాల్లో ప్రస్తావన ఉన్నా వాస్తవం మాత్రం అందుకు విరుద్ధం.

గడ్డిపోచ కూడా గంభీరంగానే..

ట్రాయ్ గడ్డపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరైనా చనిపోవాల్సిందే. గురి తప్పని వీలుకాళ్లు ట్రాయ్ సొంతం. అందుకే తీరం చేరినా కిందకు దిగడానికి గ్రీకు సైనికులు భయపడ్డారు. కానీ అకిలీజ్ నాయకత్వంలోని మెర్మిడన్స్ కు చావంటే తమాషా.. బాణాల వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ట్రాయ్ గడ్డపై అడుగుపెట్టారు. తీరంలోని ట్రాయ్ సైన్యంతో మెర్మిడన్స్ తలపడ్డారు.. పోరు హోరాహోరిగా సాగింది. మెర్మిడన్స్ గెలిచారు. సముద్ర తీరం నుంచి ట్రాయ్ సైన్యం కోట లోపలికి వెళ్లిపోయింది.

ట్రాయ్ ముట్టడి సంవత్సరాల పాటు సాగుతుందని గ్రీకులకు తెలుసు. పదేళ్ల వరకు పోరాడేందుకు అవసరమైన యుద్ధసామాగ్రితో పాటు నిత్యావసరాలను తెచ్చుకున్నారు.. అకిలిజ్ లాంటి యోధుడు ఉన్నా ట్రాయ్ పై గెలుస్తామన్న నమ్మకం గ్రీకులకు లేదు. ఒకవేళ గెలిచినా ఆ విజయాన్ని చూసేందుకు తమలో ఎంతమంది బతికి ఉంటారో అన్న అనుమానం గ్రీకు రాజులకు ఉండేది. అందుకే ప్రాణనష్టాన్ని నివారించడానికి ఇథాకా రాజు ఒడిస్సియస్ రంగంలోకి దిగాడు. మెనెలేయస్ ను తీసుకొని ట్రాయ్ రాజు ప్రయామ్ ను కలిశాడు.హెలెన్ ను అప్పగిస్తే వెళ్లిపోతామన్నాడు. కానీ కోరి వచ్చిన అమ్మాయిని కాదని పంపితే అది అవమానమని భావించిన ప్రయామ్,యుద్ధంలోనే తేల్చుకుందామన్నాడు.. దీంతో ఒడిస్సియస్ ఇంకో ప్రతిపాదన చేస్తాడు. పారిస్, మెనెలేయస్ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికే హెలెన్ సొంతమన్నాడు.

పశువుల కాపరి ఇంట్లో పెరిగిన పారిస్ కు యుద్ధ విద్యల్లో పెద్దగా ప్రావీణ్యం ఉండదు.. అతణ్ని మెనెలేయస్ ఈజీగా ఓడిస్తాడని అంతా అనుకున్నారు. తాను ఓడిపోతే హెలెన్ దక్కదన్న సంగతి పారిస్ కు తెలుసు. అందుకే మెనెలేయస్ తో వన్ టూ వన్ పోరాటంలో గెలవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. అయినా అతడి చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. పారిస్ చనిపోయాడనుకున్న మెనెలేయస్ యుద్ధం ముగిసిందని ప్రకటిస్తాడు. కానీ కొన ఊపరితో ఉన్న పారిస్ తిరిగి లేస్తాడు. అప్పటికే చీకటి కావడంతో పోటీ అక్కడితో ముగుస్తుంది. తర్వాత రోజు గ్రీకు, ట్రోజన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ పరిణామాలను చూసి మెనెలేయస్ సంతోషించాడు. ఎందుకంటే అతడి లక్ష్యం హెలెన్ కాదు. ట్రాయ్ ను సర్వనాశనం చేయడం.

సహాయ నిరాకరణ

గ్రీక్, ట్రోజన్ల మధ్య గెలుపు సమాన దూరం పాటించింది. అందుకే ఒక రోజు ట్రోజన్లది పైచేయి అయితే మరో రోజు గ్రీకులదయింది. ఇలా తొమ్మిది సంవత్సరాలు గడిచాయి. అకిలీజ్ వీరత్వం, వ్యూహాలతో ట్రోజన్లపై గ్రీకులదే పైచేయి అవుతుంది. కానీ ట్రాయ్ కోట గోడల్లోని మట్టి పెళ్లను కూడా గ్రీకులు పెకిళించలేకపోయారు. కోట బయట ఉన్న అపోలో గుడిని కొల్లగొట్టిన గ్రీకులు, అందులోని అంతులేని సంపదను దోచుకున్నారు. గ్రీకులు రావడానికి ముందు అపోలోను పూజించేందుకు వచ్చిన ట్రాయ్ రాకుమారి బ్రిసీస్ ను బంధించి అకిలిజ్ కు బహుమానంగా ఇచ్చారు. అందగత్తె అయిన బ్రిసీస్ ను అకిలీజ్ గాఢంగా ప్రేమిస్తాడు. కానీ అగమెమ్నన్ కూడా ఆమెనే కోరుకుంటాడు. అకిలీజ్ లేని సమయం చూసి బ్రిసీస్ ను ఎత్తుకొస్తాడు. విషయం తెలుసుకున్న అకిలీజ్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇతర గ్రీకు రాజులు నచ్చచెప్పడంతో కోపాన్ని అణుచుకుంటాడు. అగమెమ్నన్ చేసిన పనికి నిరసనగా యుద్ధానికి దూరంగా ఉంటాడు.

అప్పటిదాకా దక్కిన విజయాలను సొంత బలమనుకున్న అగమెమ్నన్.. అకిలీజ్ లేకున్నా ట్రాయ్ ను గెలుస్తానని శపథం చేస్తాడు. అందుకే మొండిగా గ్రీక్ సైన్యాన్ని ట్రాయ్ కోట వైపు నడిపిస్తాడు. కానీ హెక్టర్ వ్యూహంలో చిక్కుకొని గ్రీకు సైనికులు పిట్టల్లా రాలిపోయారు. బతికి ఉంటే మరో రోజు ట్రాయ్ ను గెలవొచ్చనుకున్న అగమెమ్నన్, యుద్ధ రంగం నుంచి సైన్యాన్ని వెనక్కి రప్పించాడు. తొమ్మిదేళ్ల లో గ్రీకులపై ట్రోజన్లకు లభించిన భారీ విజయం అదే.. అందుకే ఆ అవకాశాన్ని వదులుకోవద్దనుకుంటారు.. రాత్రి పూట గ్రీక్ క్యాంప్ పై అకస్మాత్తుగా ట్రోజన్లు దాడి చేస్తారు. హెక్టర్ చేతిలో అకిలీజ్ తమ్ముడు పెట్రోక్లజ్ చనిపోతాడు. దీంతో అప్పటిదాకా యుద్ధం వద్దనుకున్న అకిలీజ్ కత్తి పట్టి కదనరంగంలోకి దూకుతాడు.

తన తమ్ముణ్ని చంపిన హెక్టర్ ను అంతం చేస్తానని అకిలీజ్ శపథం చేస్తాడు. అందుకే ఒంటరిగా ట్రాయ్ కు వెళతాడు. దమ్ముంటే ముఖాముఖి పోరులో తనను ఓడించాలని సవాల్ చేస్తాడు. హెక్టర్ వీరుడే అయినా అకిలీజ్ నడిచే మృత్యువు. అతడి చేతిలో ఓడడమంటే ప్రాణాలు పోవడమే. అందుకే తాను లేకున్నా ట్రాయ్ ను ఎలా కాపాడుకోవాలో సైన్యాధికారులకు చెప్పి ఒంటరి పోరుకు సిద్ధపడతాడు. అకిలీజ్, హెక్టర్ మధ్య పోరాటం భీకరంగా సాగింది. ఎవరు గెలుస్తారో అని అటు ట్రోజన్లు, ఇటు గ్రీకులు ఊపిరి బిగపట్టి చూస్తారు.. అదృష్టం అకిలీజ్ వైపు ఉంది. హెక్టార్ చనిపోయాడు.

హెక్టర్ ను చంపిన అకిలీజ్ అతడి శవాన్ని రథానికి కట్టి ఈడ్చుకెళ్లాడు.దహనం చేయకుండా కుక్కలకు ఆహారంగా వేశాడు. ఇది తెలుసుకున్న హెక్టర్ తండ్రి ప్రయామ్ రహస్యంగా అకిలీజ్ ను కలిశాడు. వీరమరణం పొందిన తన కొడుక్కి సంప్రదాయబద్దంగా అంతిమ సంస్కారం చేయడానికి అనుమతించాలని వేడుకున్నాడు. కన్నీళ్లతో వేడుకున్న ప్రయామ్ ను చూసి అకిలిజ్ గుండె కరుగుతుంది.. దీంతో హెక్టర్ శవాన్ని ట్రాయ్ కు తీసుకెళ్లిన ప్రయామ్… లాంఛనాలతో దహనం జరిపించాడు

ట్రోజన్ హార్స్

హెక్టర్ చనిపోయినా, ట్రోజన్ల ధైర్యం చెక్కుచేదరలేదు. హెక్టర్ తమ్ముడు పారిస్ సైన్యాన్ని నడిపిస్తాడు. దొంగచాటుగా అతడు వేసిన విషపు బాణం కాలిమడిమలో గుచ్చుకోవడంతో అకిలీజ్ చనిపోయాడు.. వీరాధివీరుడైన అకిలీజ్ నిస్సహాయంగా చనిపోవడంతో గ్రీక్ సైన్యాన్ని భయం చుట్టుముడుతుంది. ఇక ట్రాయ్ ను గెలవడం అసాధ్యమనుకుంటారు. కానీ ఒడిస్సియస్ ఓ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా యుద్ధం వద్దని గ్రీకు సైన్యం తిరిగి వెళ్లిపోతుంది. పోతూ పోతూ ట్రోజన్లకు బహుమతిగా చెక్కతో తయారుచేసిన పెద్ద కొయ్య గుర్రాన్ని ఇస్తుంది. దీన్నే ట్రోజన్ హార్స్ అంటారు. ఇందులో ఒడిస్సియస్ తో పాటు గ్రీకు వీరులు దాక్కుంటారు. గ్రీకు సైన్యం కూడా వెళ్లినట్టు వెళ్లి మళ్లీ వెనక్కి మళ్లుతుంది.. గ్రీకులు వెళ్లిపోయారనుకున్న ట్రోజన్లు సంబరాలు చేసుకుంటారు. బహుమతిగా ఇచ్చిన ట్రోజన్ హార్స్ ను కోటలోకి తీసుకెళతారు. ఇందుకోసం కోట గోడల్ని కూడా బద్దలు కొడతారు..

ట్రోజన్ హార్స్ ను కాల్చేయాలని కసండ్రాతో పాటు కొంతమంది చెప్పినా ప్రయామ్ వినిపించుకోడు. రాత్రి పూట కొయ్యగుర్రం నుంచి బయటికొచ్చిన గ్రీకు వీరులు ఒక్కసారిగా ట్రోజన్లపై విరుచుకుపడ్డారు. కోట తలుపుల్ని తెరుస్తారు.. ఆ క్షణం కోసమే ఎదురుచూసిన గ్రీకు సైన్యం,ట్రాయ్ లోపలికి చొచ్చుకొచ్చింది. దొరికినవారిని దొరికినట్టు నిర్దాక్షిణ్యంగా అంతం చేసింది. పారిస్ తో పాటు ప్రయామ్ ను కూడా గ్రీకుల చేతుల్లో చనిపోయారు. హెక్టర్ భార్యతో పాటు అతడి మూడునెలల బాబును కూడా చంపేస్తారు. కసండ్రాను బంధించి అగమెమ్నన్ కు అప్పగిస్తారు.. అతడు మాత్రం హెలెన్ ను కోరుకున్నాడు.

నమ్మకద్రోహం చేసిన హెలెన్ ను చంపాలని మెనెలేయస్ భావిస్తాడు.. కానీ ఆమె ముఖం చూశాక ఆ పనిచేయలేకపోతాడు.. ఆమెను తీసుకుని స్పార్టా వెళతాడు.. ట్రాయ్ ను కాల్చి బూడిద చేశాక అగమెమ్నన్ కూడా మైసిని వెళతాడు.. కానీ అతడి భార్య క్లైటమిస్ట్రా అతడి పాలిట మృత్యుదేవత అయింది. ఇజిస్తస్ తో సంబంధం పెట్టుకున్న క్లైటమిస్ట్రా, అగమెమ్నన్ ను దారుణంగా చంపేసింది.

ట్రోజన్ యుద్ధంలో గ్రీకులు గెలిచారు.. కానీ ఒక్క ఒడిస్సియస్ తప్ప మిగతా వాళ్లంతా ఏదోలా నరకయాతన అనుభవించారు.. ఒడిస్సియస్ కూడా రాజ్యానికి వెళ్లకుండా సముద్రయాత్రలు చేశాడు. ఇంత దారుణానికి పరోక్షంగా కారణమైన హెలెన్ మాత్రం మెనెలేయస్ తో స్పార్టాలోనే చనిపోయింది.

కథ కాదు నిజమే

ట్రోజన్ యుద్ధాన్ని గ్రీకు మహాకవి హోమర్ రాసిన అద్భుత కల్పన అని కొట్టిపారేసేవాళ్లున్నారు.. కానీ  గ్రీకులకు ట్రోజన్లకు జరిగిన యుద్ధం.. నిజమే అనేందుకు చారిత్రక ఆధారాలున్నాయి. గ్రీకులు కాల్చి బూడిద చేసిన ట్రాయ్ నగర అవశేషాలను 1852లో చార్లెస్ మెక్లారెన్ అనే పురాతత్వ శాస్త్రవేత్త కనుగొన్నాడు.. నాటి నుంచి ట్రోజన్ యుద్ధం చరిత్ర పుస్తకాల్లో సగర్వమైన స్థానం పొందింది. అప్పటిదాకా పుక్కిటి పురాణంగా ఉన్న అమర ప్రేమ అస్తిత్వాన్ని పొందింది.