ఏపీ పునర్విభజన అంశంపై మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి విచారిస్తామని, అందుకనుగుణంగా లిస్టులో పిటిషన్ వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. గతంలో ఉండవల్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విభజన విషయంలో జరిగిన పొరపాట్లపై పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన జరగలేదని అప్పటి నుంచే ఆయన అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విభజించే ప్రక్రియ సక్రమంగా లేదని ఉండవల్లి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం తెలంగాణ ఎలాగూ విడిపోయింది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్రాల విభజన సమయంలో పాటించేలా తగిన విధివిధానాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించమని సవరణ పిటిషన్ వేశారు. ఈ అంశం తాజాగా సుప్రీంకోర్టు ముందుకు రాగా, పరిగణనలోకి తీసుకున్న సీజేఐ.. విచారణ త్వరగా జరిపేందుకు అంగీకరించారు.