The Supreme Court dismissed the petition on liquor
mictv telugu

మందు తాగితే మంచిదటగా.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

September 23, 2022

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం మద్యం, సిగరెట్లపై అసక్తికర వ్యాఖ్యలు చేసింది. మద్యం తాగితే మంచిదని అంటారుగా అంటూ క్యూరియాసిటీని ప్రదర్శించింది. ఢిల్లీలో మద్యం ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ కోరుతూ అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్బంగా.. సిగరెట్ ప్యాకెట్లపై హానికరం అని స్టిక్కర్ వేసినట్టే మద్యం సీసాలపై కూడా స్టిక్కర్లు ముద్రించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అంతేకాక ఈ విషయాన్ని మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని, దీని అనర్ధాలు తెలిసి యువత దూరంగా ఉంటారని విన్నవించారు. దీంతో స్పందించిన సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని కొందరు నమ్ముతారని, అలాగే కొందరు డాక్టర్లు కూడా మితమైన మద్యం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తుంటారని పేర్కొన్నారు. కానీ, సిగరెట్ల విషయంలో ఎవరూ అలా చెప్పలేదని స్పష్టం చేసింది. అందువల్ల మద్యం బాటిళ్లపై స్టిక్కర్లు అంటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే తామే రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో అడ్వకేట్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.