పరమాత్మ ప్రకటన.. రూ. లక్ష జరిమానా విధించిన సుప్రీంకోర్టు
కొంతమంది ప్రచారం కోసం సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానాన్ని వాడుకుందామనుకుంటారు. వీరి దుర్బుద్ధిని గమనిస్తున్న సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీవ్రంగా హెచ్చరిస్తూ తగిన జరిమానాలు విధిస్తూ ఉంటుంది. తాజాగా ఇలాంటి కోవలోకి వచ్చే ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దివంగత మత గురువు శ్రీశ్రీ ఠాకూర్ అనుకుల్ చంద్రను పరమాత్మగా ప్రకటించాలని, అన్ని మతాలకు గురువుగా ఆయనను గుర్తించాలని ఉపేంద్రనాథ్ దలై అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, సిటి రవికుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. వెంటనే పిటిషనర్ దలై తన విజ్ఞప్తిని ఏకరువు పెట్టడం మొదలెట్టాడు. దీంతో ఆగ్రహంచిన న్యాయమూర్తులు మీ ఉపన్యాసం వినడానికి మేం ఇక్కడ లేమని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మీ విజ్ఞప్తి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ఇది లౌకిక దేశమని, ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని పునరుద్ఘాటించింది. అలాంటప్పుడు ఓ నిర్దిష్ట మతాన్ని అనుసరించమని ప్రజలను ఎలా అడుగుతామని నిలదీసింది. మీరు కావాలంటే మీ వరకు ఆయనను పరమాత్మగా పరిగణించవచ్చని సూచిస్తూ పిటిషన్ ని తోసిపుచ్చారు. అంతేకాక, ప్రచారం కోసం ఇలాంటి పిల్ దాఖలు చేసినందుకు లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.