The Supreme Court has ordered the release of prisoners who have served ten years
mictv telugu

పదేళ్లు శిక్ష అనుభవించిన ఖైదీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

September 16, 2022

యావజ్జీవ శిక్ష పడి పదేళ్లు జైలులో శిక్ష అనుభవించిన ఖైదీల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కింది కోర్టులు విధించిన శిక్షలపై హైకోర్టులో చేసిన అప్పీళ్లు సమీప కాలంలో విచారణకు వచ్చే అవకాశాలు లేకుంటే అలాంటి వారిని కూడా రిలీజ్ చేయాలని ఉత్తర్వులలో సూచించింది. బలమైన కారణాలుంటే తప్ప ఖైదీలను విడుదల చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఖైదీలతో జైళ్లలో రద్దీ పెరిగిపోయిందని, దానిని తగ్గించడానికే తాజా నిర్ణయం తీసుకుంటున్నామని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకాల ధర్మాసనం వెల్లడించింది. ఖైదీల విడుదలపై కసరత్తు పూర్తి చేయడానికి హైకోర్టులు, న్యాయ సేవా సంస్థలకు నాలుగు వారాల గడువిస్తూ తదుపరి విచారణను జనవరి నెలకు వాయిదా వేసింది. కాగా, శిక్ష తగ్గించాలంటూ హైకోర్టుల్లో దాఖలు చేసిన అప్పీళ్లు చాలా కాలంగా పెండింగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమను విడుదల చేయాలంటూ పలువురు ముద్దాయిలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన ధర్మాసనం పై విధంగా తీర్పునిచ్చింది.