అమరావతి రాజధాని కేసులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నెల రోజులలో ఇన్ని పనులు, ఆరు నెలల్లో ఇన్ని పనులు చేయాలని హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు వైఖరిని తప్పుబట్టిన సుప్రీం.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ‘హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? డెవలప్ మెంట్ అంతా ఒకే చోట ఉంటే ఎలా? ఆరు నెలల్లో నిర్మాణం చేయమంటారా? డెవలప్ మెంట్ ఎలా చేయాలో ప్రభుత్వం పని. హైకోర్టుది కాద’ని స్పష్టం చేసింది.
అలాగే రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని తేల్చి చెప్పింది. అటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. ఆలోపు తప్పనిసరిగా జవాబు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, శ్రీరామ్, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా, రాజధాని రైతుల తరపున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదించారు. అయితే హైకోర్టు ఆదేశించిన ఏడు అంశాలపై స్టే విధించాలని కోరగా, సుప్రీం దానికి నిరాకరిస్తూ కేవలం కాలపరిమితికి సంబంధించిన ఉత్తర్వులపై మాత్రమే స్టే విధించడం కొసమెరుపు.