The Supreme Court heard the case of purchase of TRS MLAs
mictv telugu

బీజేపీకి ఏం సంబంధం? ఎమ్మెల్యేల ఎరపై సుప్రీం సీరియస్

November 5, 2022

మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించింది. ఏం జరిగిందంటే.. తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరపున న్యాయవాది విశ్వనాథన్ వాదిస్తూ.. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో 41 (ఏ) కింద నోటీస్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులున్నా.. అవి పట్టించుకోకుండా ముగ్గురిని అరెస్ట్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో స్పందించిన కోర్టు.. దర్యాప్తుపై స్టే కోరుతూ రాజకీయ పార్టీ అయిన బీజేపీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని ప్రశ్నించింది. దీనికి బీజేపీకి ఏం సంబంధమని, అయినా బీజేపీ పిటిషన్‌ని హైకోర్టు విచారణకు ఎలా స్వీకరించిందని సీరియస్ అయ్యింది.

అయితే బీజేపీ పిటిషన్‌కు తమకు సంబంధం లేదని విశ్వనాథన్ స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని, బీజేపీ పిటిషన్ దాఖలు చేస్తే తమను నిందిస్తున్నారని వాపోయారు. అటు బీజేపీ ఎందుకు కోర్టును ఆశ్రయించిందని లూథ్రా ప్రశ్నించగా, ఈ ప్రశ్న హైకోర్టును అడగాలని, ఆ పార్టీకి ఉన్న అర్హత ఏమిటని జడ్జీలు అభిప్రాయపడ్డారు. హైకోర్టులో ఏం జరిగిందని ప్రశ్నించగా, దర్యాప్తును పెండింగ్‌లో పెట్టిందని, దాంతో తమ చేతులు కట్టేసినట్టైందని లూథ్రా బదులిచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టడానికి హైకోర్టు, సుప్రీంకోర్టులలో పెండింగులో ఉన్న పిటిషన్లు అడ్డం కాదని, రూల్స్ ప్రకారం విచారణ చేపట్టవచ్చని తెలిపింది. ట్రయల్ కోర్టు పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పి.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే నిందితులను రిమాండుకు తరలంచేలా తాము దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని లూథ్రా పదేపదే కోరగా.. ఇలా అయితే నిందితులకు బెయిల్ ఇచ్చేస్తామని హెచ్చరించింది.