The Supreme Court ruled in favor of the endowment Department in 540 acres of land
mictv telugu

HYD 15 వేల కోట్ల భూమిపై దేవాదాయ శాఖకు అనుకూల తీర్పు

September 14, 2022

రూ. 15 వేల కోట్ల విలువైన 540 ఎకరాల భూవివాదంపై సుప్రీంకోర్టు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఉదాసీన్ మఠానికి అనుకూల తీర్పునిచ్చింది. హైద్రాబాద్ కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఈ భూములను గతంలో నాలుగు దఫాలుగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు 99 ఏళ్ళ లీజుకిచ్చింది. అయితే తర్వాత భూముల రేట్లు పెరగడంతో ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ ఉదాసీన్ మఠం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. విచారించిన ట్రిబ్యునల్.. కంపెనీకి ఇచ్చిన లీజుని 2011లో రద్దు చేసింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయిల్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, 2013లో డిస్మిస్ చేశారు. దీన్ని కూడా సవాల్ చేసిన కంపెనీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో యథాతథ స్థితిని కొనసాగించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇన్నేళ్ళకు తీర్పును వెల్లడించిన సర్వోన్నత న్యాయస్థానం ఆయిల్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇలా మూడు సార్లు మూడు చోట్ల ఆ కంపెనీ ఎదురుదెబ్బలు తిన్నది. కీలక ప్రాంతంలో ఉన్న ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ. 15 వేల కోట్లుంటుందని అంచనా. ఈ తీర్పు పట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కుల దేవాదాయ శాఖ పరిధిలోని సంస్థలకే చెందుతుందని ఈ తీర్పుతో స్పష్టమైందన్నారు. ఇదే స్పూర్తితో ఆక్రమణలో ఉన్న మిగతా భూముల విషయంలో పోరాటం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.