30మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్…!!
అసోంలోని మజులీ జిల్లాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు క్రమశిక్షణ పేరుతో 30మంది విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై జిల్లా డిప్యూటీ కమిషనర్ విచారణకు ఆదేశించారు. గురువారం ఉదయం అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రార్థన సమయంలో నిక్కీ అనే టీచర్ జుట్టు పొడవుగా ఉన్న విద్యార్థులను గుర్తించి…వెంటనే పాఠశాల మైదానంలో నిల్చోబెట్టి విద్యార్థుల జుట్టు కత్తిరించాడు.
దీంతో విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు నిరాకరిస్తున్నారు. తమ చిన్నారులు ఏడుస్తూ ఇంటికి వచ్చారని..ఇప్పుడు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఈ ఘటనను చాలా అవమానంగా భావిస్తున్నారని పేరేంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ అమలు చేసేందుకు ఉపాధ్యాయులకు హక్కు ఉందని…కాని పరిమితులు దాటకూడదని తల్లిదండ్రులు అంటున్నారు. అసెంబ్లీ సమయంలో విద్యార్థుల ముందు ఇలా చేయడం వారు అవమానకరంగా భావిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తమ చర్యను సమర్ధించుకుంది పాఠశాల యాజమాన్యం. మార్గదర్శకాల మేరకే జుట్టు ఎక్కువగా ఉన్న విద్యార్థులపై క్రమశిక్షణ కింద ఈ చర్యను చేపట్టినట్లు తెలిపారు.