నిమజ్జనంపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

నిమజ్జనంపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

September 14, 2021

The Telangana government has approached the Supreme court over the immersion of Vinayaka

ఒకవైపు హైకోర్టు తీర్పు, మరోవైపు భక్తుల ఆందోళనలు వెరసి వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల భక్తుల్లో, వినాయక మండపాల నిర్వాహకుల్లో భయందోళనలు నిండాయి. గందరగోళం ఏర్పడింది. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను చెరువులో కలపకుండా చూడాలని అడ్వొకేట్ మామిడి వేణు మాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ‘మట్టిబొమ్మలను నిమజ్జనం చేసుకోవచ్చు. ట్యాంక్ బండ్ వైపు నుంచి విగ్రహాలను చెరువులో వేయొద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‎తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రబ్బర్ డ్యాములతో ప్రత్యేక కుంటలు ఏర్పాటుచేయాలి. హుస్సేన్ సాగర్లో అన్ని చోట్లా కాకుండా పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డు, సంజీవవయ్య పార్కుల వైపు నుంచి నిమజ్జనం చేసుకోవాలి. ఇళ్లలోని విగ్రహాలను ఇంట్లోని బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలి. వినాయక మంటపాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమికూడకూండా చర్యలు తీసుకోవాలి. నిమజ్జనం వేడుకల్లో కోవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలి. ప్రజలకు ఉచితంగా మాస్కులు ఇవ్వాలి. భౌతిక దూరం పాటించేలా చూడాలి. నిమజ్జనం పూర్తయిన వెంటనే వ్యర్థాలను తొలగించాలి. నిమజ్జనానికి వచ్చే వారు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీని కోర్టు ఆదేశించింది.